ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని హైకోర్టు సోమవారం పిటిషనర్లను ఆదేశించింది. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లో ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. తద్వారా రైతు ఆత్మహత్యలకు వడ్డీ వ్యాపారుల వేధింపులు ఎంత వరకు కారణమో ప్రభుత్వం నుంచి స్పష్టంగా తెలుసుకునేందుకు తమకు వీలు కలుగుతుందని పేర్కొంది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పంటకు కనీస మద్దతు ధర కల్పించే విషయంలో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడం లేదని, అలాగే రైతు ఆత్మహత్యల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలు దాఖలైన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయా? అని ప్రశ్నించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ స్పందిస్తూ... తగ్గాయని, అందుకు తగిన ఆధారాలు కూడా చూపుతామన్నారు.
అయితే పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ వాదనలతో విభేదించారు. ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. బ్యాంకులు రుణాలను రీ షెడ్యూల్ చేయనందున రైతులు ప్రైవేటు వ్యక్తులు, వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారని చెప్పారు. అప్పులు చెల్లించలేక, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ విషయంలో రైతులను చైతన్యపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లొద్దని, వారు వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రైతులకు చెబుతున్నామని, ఇందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని శరత్ తెలిపారు.
రుణాలు రీ షెడ్యూల్ కానందునే..
బ్యాంకులు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయడం లేదని, దీనివల్లే వారు విధి లేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి కోర్టుకు నివేదించారు. దీనికి ధర్మాసనం స్పంది స్తూ... అయితే వడ్డీ వ్యాపారుల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకున్న దాఖలు ఏవైనా ఉంటే వాటిని అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచాలని రచనారెడ్డికి స్పష్టం చేసింది. అలాగే కేవలం వ్యవసాయ రుణాలను తీసుకోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? అని ధర్మాసనం సందేహం వెలి బుచ్చింది.
ఒక్క వ్యవసాయ రుణాలే కాక, పిల్లల విద్య, వివాహాల కోసం కూడా రుణం తీసుకుంటున్నారని, అయితే ఈ రుణాలను కూడా వ్యవసాయ ఆదాయం ద్వారానే రైతులు చెల్లించాల్సి వస్తోందని రచనారెడ్డి తెలిపారు. ఇందుకు ధర్మాసనం.. ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయని, చేయడం లేదంటే తాము అంగీ కరించబోమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు అనే క పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నాయని, అయితే క్షేత్రస్థాయిలో సక్రమంగా అందక సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడింది. ఆత్మహత్యలు తగ్గలేదని చెబుతున్న నేపథ్యంలో డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కడెక్కడ ఆత్మహత్యలు జరిగా యో కనీసం ఐదు ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీ సుకురావాలని పిటిషనర్లకు తెలిపింది. అలాగే వడ్డీ వ్యాపారుల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటే అందుకు సంబంధించి కూడా ఐదు ఘటనల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలంది. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత పూర్తి వివరాలతో స్థా యీ నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కు స్పష్టం చేసింది.