ఆ వివరాలు సమర్పించండి | Submit the details | Sakshi
Sakshi News home page

ఆ వివరాలు సమర్పించండి

Published Fri, Apr 1 2016 3:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

ఆ వివరాలు సమర్పించండి - Sakshi

ఆ వివరాలు సమర్పించండి

♦ ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల ప్రయోజనాలపై హైకోర్టు
♦ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు
 
 సాక్షి, హైదరాబాద్: పంట నష్టాలు, రుణ బాధల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలు పూర్తిగా అందుతున్నాయో లేదో వివరించాలని ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతు ఆత్మహత్యల నివారణకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసేలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో జీవో 69 ప్రకారం రూ. లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారు రుణాలను వన్‌టైం సెటిల్‌మెంట్ కింద మాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌పై గురువారం విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

నిజంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం ఏం చేస్తున్నామో వివరిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ తెలపగా అందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ రాష్ట్రస్థాయి వ్యవసాయదారుల కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఉభయ రాష్ట్రాలు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు వెంటనే ఆగిపోతాయా అంటూ ప్రశ్నించింది. కోర్టుకు వచ్చి ప్రభుత్వాలను నిందించడం చాలా సులభమని... ఈ వ్యవహారంలో తాము ఎంత చేయాలో అంతా చేస్తున్నామని... ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్నాయంది.

ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నా తమకు ప్రయోజనాలను వర్తింప చేయలేదని ఒక్క రైతయినా చెప్పారా? ఒకవేళ చెప్పి ఉంటే అటువంటి వారి వివరాలను సమర్పించాలని పిటిషనర్లకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ స్పందిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలను పిటిషనర్లు తమకు సమర్పించారని అందచేశారన్నారు. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులతో మాట్లాడారని, పలువురు పంట, రుణాల వల్ల ఆత్మహత్యలు చేసుకోలేదని వారి కుటుంబీకులే చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలతోపాటు వారికి అందిస్తున్న సాయం వివరాలను సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. కాగా, విచారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి కొందరు రైతుల కుటుంబాలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తీసుకురావడాన్ని అత్యంత బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement