జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తా | Will develop Jahangir Peer Dargah | Sakshi
Sakshi News home page

జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తా

Published Thu, Apr 14 2016 12:10 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తా - Sakshi

జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తా

మౌలిక వసతుల కల్పనకు భూమి కేటాయిస్తాం
♦ సీఎం కేసీఆర్ హామీ
♦ అజ్మీర్ దర్గాకు రాష్ట్రం తరఫున చాదర్, నజరానాలు
 
 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తామని, దర్గా సందర్శకులకు వసతితోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్‌లతో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. సమైక్య పాలనలో హిందూ దేవాలయాలతో పాటు ముస్లిం, ఇతర మతస్తుల ప్రార్థనా స్థలాలనూ నిర్లక్ష్యం చేశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు.

ఉద్యమ సమయంలో తాను అనేక సార్లు జహంగీర్ పీర్ దర్గాను సందర్శించానని.. అన్ని మతాల వారూ వేల సంఖ్యలో అక్కడికి వెళ్తారని పేర్కొన్నారు. ఎంతో ప్రాశస్త్యం, ఆదరణ ఉన్నా... ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం అందకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, దర్గా సమీపంలోని ప్రభుత్వ భూమిని వసతుల కల్పనకు వినియోగిస్తామని చెప్పారు. దర్గాకు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో సూచించాలని ఏసీబీ డీజీ ఏకే ఖాన్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని సీఎం ఆదేశించారు. దర్గా లోపల కూడా సులభంగా మొక్కులు చెల్లించుకునేలా నిర్మాణాలను సరిచేయాలని సూచించారు.

 అజ్మీర్ దర్గాకు చాదర్
 రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గాలో తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పించే చాదర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి పంపించారు. ఐదు రోజుల నుంచి జరుగుతున్న అజ్మీర్ దర్గా ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చాదర్‌తో పాటు ప్రత్యేక నగదు, నజరానాలను కూడా మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, వక్ఫ్‌బోర్డు సీఈవో అసదుల్లా ద్వారా పంపారు. అంతకు ముందు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement