
రోడ్డు ప్రమాదాలు అరికట్టలేరా?: కొరుముట్ల
- బస్సులు అతివేగంతో వెళుతున్నా పట్టించుకోవడంలేదు
- రోడ్డు ప్రమాదాలపై పలువురు సభ్యుల ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. ప్రమాదాలు తీవ్రమవుతున్నా నివారణ చర్యలు చేపట్టడం లేదని, రోడ్లపై ఎక్కడా రేడియం స్టిక్కర్లు లేవని, మలుపుల వద్ద ఎలాంటి ముందస్తు సూచనలు లేవని, ప్రైవేటు బస్సులు మితిమీరిన వేగంతో వెళుతున్నా పట్టించుకునే వారు లేరని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్డు ప్రమాదాలపై సుమారు ఇరవై నిముషాల పాటు శాసన సభలో చర్చ జరిగింది. చెన్నై-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోజూ ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు) అన్నారు. ప్రధానంగా రేణిగుంట, కడప మార్గంలో ప్రతి రోజూ ప్రమాదం జరిగి ప్రయాణికులు, ప్రజలు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదాలు జరుగుతున్న చోట స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలంటే, అలా చేస్తే హైవేలకు అర్థం లేదని చెప్పడమంటే జనాన్ని చంపడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా గొల్లపూడి వద్ద మెడికోల మృతి ప్రైవేటు బస్సుల అతి వేగానికి నిదర్శనమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ప్రైవేటు బస్సుల వేగానికి అడ్డూ అదుపూ లేకపోవడం వల్లనే మెడికోలు మృతి చెందారన్నారు. హైవేలలో వేగ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని, ఇష్టారాజ్యంగా వెళ్లడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. తక్షణమే హైవేల పక్కనే ఉన్న వైన్ షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. 2014-15తో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రమాదాలు శాతం 1.4 మేర తగ్గుముఖం పట్టాయని మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు.