
మర్యాదగా మాట్లాడుకుందాం!
ఏపీ జెన్‌కో ఎండీ పేషీలో కొత్తగా ‘మర్యాదగా మాట్లాడుకుందాం’ అనే బోర్డు వెలిసింది. దీన్ని చూసిన వాళ్లకు అంత అమర్యాదగా ఎవరు మాట్లాడుతున్నారు? అనే అనుమానం కలిగింది. విషయం ఏమిటా అని వాకబు చేస్తే... కొంతమంది తెలుగు తమ్ముళ్లు జెన్‌కో ఎండీని కలవడానికి వచ్చి నానా యాగీ చేస్తున్నారట! ‘మేం సీఎం మనుషులం. ఎండీ ఏ పనిలో ఉంటే మాకెందుకు? మేం వెంటనే కలవాలి.
పంపించండి’ అంటూ బలవంతపెడుతున్నారట. ‘సార్ మీటింగ్‌లో ఉన్నారు... ఆగండి’ అని పేషీ సిబ్బంది చెబితే వారిపై నోటి దురుసుతనం ప్రదర్శిస్తున్నారట. వాళ్లను ఏమీ చేయలేక, వాళ్లు అనే మాటలు భరించలేక.. అధికారులు ఇలా బోర్డు తగిలించారని తెలిసింది.
- సాక్షి, హైదరాబాద్