
ఓటు వేయకుంటే హక్కు కోల్పోయినట్టే
పంజగుట్ట: ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని, లేనిపక్షంలో సమాజంలో ఉండే హక్కును కోల్పోతారని యువ వారధి ఆర్గనైజేషన్ ప్రతినిధి మయూర్ పట్నాల పేర్కొన్నారు. యువ వారధి ఆర్గనైజేషన్, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రేటర్‌లో ప్రజాప్రతినిధుల తీరుపై మూడు డివిజన్లలో సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు. సర్వే రిపోర్టును ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివరించారు. మయూర్ మాట్లాడుతూ.. రామకృష్ణాపురం, గడ్డిఅన్నారం, హస్తినాపురం డివిజన్లలో సుమారు 230 కుటుంబాలను ప్రత్యక్షంగా కలిశామన్నారు.
పోటీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థుల పనితీరుపై వివరాలు సేకరించినట్టు చెప్పారు. అయితే, తమ సర్వేలో కేవలం 18 శాతం మంది మాత్రమే ప్రజాప్రతినిధుల పనితీరు బాగుందని చెప్పారన్నారు. చాలా మంది మధ్యతరగతి వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడున్నాయో తెలియదని, దిగువ మధ్యతరగతి వారు ప్రభుత్వం నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తే తప్పకుండా వినియోగించుకుంటామని తెలిపినట్లు వెల్లడించారు. పోలీస్ పెట్రోలింగ్ ఒక్కటే కాస్త మెరుగ్గా ఉందని పలువురు వెల్లడించినట్టు వివరించారు. ఐదేళ్లు పాలించే స్థానిక ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే విషయంలో జాగ్రత్తగా ఓటు వేయాలని, డబ్బులకు, ఇతర ప్రలోభాలకు లోనైతే సమస్యలు అలానే ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ ప్రతినిధులు మహేష్, నాగార్జున, యువ వారధి ప్రతినిధులు రుక్ మంగాధర్ తదితరులు పాల్గొన్నారు.