హైదరాబాద్: తాను రిటైర్డ్ ఐఏఎస్ కుమార్తెనంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి ఇంటి నుంచి నగదు తీసుకెళ్లిన మాయ లేడీని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మన్యవారి వీధికి చెందిన పి.విజయలక్ష్మి(66) 2014 డిసెంబర్‌లో తన పేరు సుజాతారావుగా చెప్పుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణ ఇంటికి వెళ్లింది.
తాను రిటైర్డ్ ఐఏఎస్ కేఎల్‌రావు కుమార్తె అని మంత్రి పీఎస్‌వో వాసుతో చెప్పింది. మంత్రి కోసం వచ్చానని అతన్ని నమ్మించి రూ.7 వేలు తీసుకుని అక్కడ నుంచి జారుకుంది. తర్వాత అనుమానం రావడంతో వాసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న విజయలక్ష్మి బుధవారం విజయవాడలో చిక్కింది. గురువారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.