విజిలెన్స్ అధికారుల వాహనం నుంచి ల్యాప్‌ట్యాప్‌ను తీసుకెళుతున్న దృశ్యం (సీసీ ఫుటేజీ)
అనంతపురం: విజిలెన్స్ శాఖ ఏడీ ల్యాప్‌టాప్ చోరీ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. రోడ్డు పనుల నాణ్యతలో డొల్లతనం బట్టబయలవుతుందనే భయంతో నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యమే ఇందుకు ప్రోత్సహించిందని, ల్యాప్‌టాప్‌ను చోరీ చేసింది ఆ కంపెనీ మేనేజర్ శంకర్‌రెడ్డేనని నిగ్గు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శంకరరెడ్డిని బుధవారం ముదిగుబ్బ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముదిగుబ్బ సీఐ కంబగిరి రాముడు వెల్లడించారు.
అక్రమాలన్నీ ల్యాప్‌టాప్‌లోనే.
ముదిగుబ్బ నుంచి మలకవేముల క్రాస్ వరకూ రహదారి పనులను నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ చేపట్టింది. అయితే ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలివ్వడమే కాక, నిబంధనలకు విరుద్దంగా మొబైల్ క్రషర్లను వినియోగిస్తున్నట్లుగా మైనింగ్ అండ్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో మైనింగ్ అండ్ విజిలెన్స్ ఏడీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నితిన్‌సాయి కనస్ట్రక్షన్ కంపెనీ అక్రమాలు బట్టబయలయ్యాయి. ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో అధికారులు ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేశారు.
వాహనంలో నుంచి ల్యాప్‌టాప్ అపహరణ
ఈ నెల 6న తనిఖీలు పూర్తి చేసి, ల్యాప్‌టాప్‌లో వివరాలన్నీ నమోదు చేసిన విజిలెన్స్ ఏడీ విజయలక్ష్మి.. అదే రోజు మధ్యాహ్నం ముదిగుబ్బలోని ఓ హోటల్‌లో భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో ల్యాప్‌టాప్‌ను తమ బొలెరో వాహనంలోనే వారు ఉంచారు. అప్పటి వరకూ అధికారులను అనుసరిస్తూ వచ్చిన నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్స్ మేనేజర్ శంకరరెడ్డి.. అధికారుల బొలెరో వాహనం వద్ద ఎవరూ లేని సమయంలో ల్యాప్‌టాప్‌ను అపహరించుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై అప్పట్లో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ముదిగుబ్బ పోలీసులు ల్యాప్‌టాప్ చోరీ జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి, పరిశీలించారు. అందులో శంకరరెడ్డి కదలికలు స్పష్టంగా ఉండడంతో అతనే దొంగగా నిర్ధారించుకుని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో శంకర్‌రెడ్డితో పాటు నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment