
బేగంపేటలో మహిళ దారుణ హత్య
బేగంపేటలో మంగళవారం సాయంత్రం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.
హైదరాబాద్ : బేగంపేటలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మంగళవారం సాయంత్రం ప్రకాశ్‌నగర్ బస్టాండ్ వద్ద ఆటోలో వెళ్తున్న మహిళను ఆమె భర్తే అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
నగరానికి చెందిన కవిత, ఈశ్వర్ భార్యభర్తలు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. 40 రోజుల క్రితం కవిత అదృశ్యమైనట్లు ఈశ్వర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో కవిత ఆమె తల్లిదండ్రుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు మంగళవారం వారిద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరారు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఈశ్వర్ భార్యను గొంతుకోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రవమైన కవిత అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఈశ్వర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.