హైదరాబాద్: కని.. కష్టపడి పెంచి.. పెద్ద చేసి... తన పెళ్లి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లిని చూసి వేదన పడిన ఓ తనయ తనువు చాలించింది. పెద్ద వయసులో అమ్మను సుఖ పెట్టాల్సింది పోయి... భారంగా మారి కష్ట పెట్టాల్సి వచ్చిందంటూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయశ్రీ (19) జూబ్లీహిల్స్ రోడ్ నెం.70 అశ్వని హైట్స్‌లో ఉన్న ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి నివాసంలో నెల రోజులుగా పని చేస్తోంది. కొంత కాలం కిందట ఊర్లో ఉన్న తల్లి నాగమణి కూడా హైదరాబాద్‌కు వచ్చి స్థానికంగానే ఓ ఇంట్లో పనికి కుదిరింది. తన పెళ్లి చేసేందుకు తల్లి కూడా ఇంటింటికి తిరిగి పనిచేస్తుండడాన్ని జయశ్రీ తట్టుకోలేకపోయింది. ఈ బాధలన్నీ తనవల్లేనని, తానే లేకుండా పోతే తల్లికి ఈ కష్టాలు ఉండవని భావించిన జయశ్రీ శనివారం ఉదయం సర్వెంట్ క్వార్టర్స్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ముందు రోజు రాత్రి జయశ్రీ బాధ విన్న కోదండరామిరెడ్డి దంపతులు ఆమెను ఓదార్చారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నావల్లే నీకు కష్టాలు.. నేనే పోతే...
Published Mon, May 8 2017 4:13 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement