
విమానాశ్రయంలో ప్రయాణికురాలు అదృశ్యం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ప్రయాణికురాలు అదృశ‍్యం అయిన ఘటన కలకలం రేపుతోంది. శనివారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన అభినవ్ కుమార్, కుష్బూ దంపతులు ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. మరో విమానం ఎక్కేందుకు కొంత సమయం ఉండటంతో వాళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో షాపింగ్‌కు వెళ్లారు.
ఆ సమయంలోనే కుష్బూ కనిపించకుండాపోయింది. దీనిపై ఆమె భర్త అభినవ్ కుమార్ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే ఎయిర్‌పోర్టులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మహిళను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఆమె ఎక్కడికైనా వెళ్లిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.