
కుష్బూ కిడ్నాప్.. హై డ్రామాకు తెర!
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలు అదృశ్యం అయిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. దుబాయి నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చిన అభినవ్ కుమార్, కుష్బూ దంపతులు ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. అయితే అంతలోనే కుష్బూ కనిపించకపోవడం కలకలం సృష్టించింది.
ఎయిర్ పోర్ట్ సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని సీసీ కెమెరా ఫుటేజీ సేకరించి పరిశీలించారు. భర్త కళ్లుగప్పి ఆ మహిళ ఎయిర్ పోర్టు నుంచి క్యాబ్ లో వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీలో ఉందని పోలీసులు తెలిపారు. భర్త, ఆమె కుటుంబంతో తలెత్తిన విభేదాల కారణంగానే ఆ ప్రయాణికురాలు ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు.
విమానం ఎక్కేందుకు కొంత సమయం ముందు తామిద్దరం ఎయిర్‌పోర్టులో షాపింగ్ చేసేందుకు వెళ్లినట్లు అభినవ్ కుమార్ తెలిపారు. ఆ క్రమంలో కొంతసేపటికే తన భార్య అదృశ్యమైందంటూ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అభినవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి.. కుష్బూను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వెల్లడించారు.