
బేగంపేట రైల్వేస్టేషన్ లో మహిళా టీసీపై దాడి
హైదరాబాద్ : టికెట్ కలెక్టర్ గీత ఘటన మరవక ముందే మరో మహిళా టీటీఈపై దుండగులు దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ కౌసల్య టికెట్ అడిగినందుకు... ఎనిమిది మంది దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే చికిత్స నిమిత్తం కౌసల్యను లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడినవారిలో నలుగురిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. మహిళా టీసీలపై దాడి చేయటం వారం రోజుల్లో ఇది రెండో సంఘటన. దాంతో మహిళా రైల్వే టీసీలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంగ్లీష్ కథనం కోసం....
ఈ నెల 18న టీసీ గీతను హఫీజ్ పేట రైల్వే స్టేషన్ లో దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. టికెట్ లేకుండా ప్రయాణించినందున జరిమానా కట్టాలని గీత అడిగిన పాపానికి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గతంలోనూ కేరళ ఎక్స్ప్రెస్లో విజయ్ కుమార్ అనే టీసీని దుండగులు రైల్లో నుంచి తోసివేయటంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.