=వారానికొకసారైనా మంచినీరందని దుస్థితి
=జలమండలి నిర్లక్ష్యంతో జనం ఇక్కట్లు
=పైప్‌లైన్ల లేమిని సాకుగా చూపుతున్న బోర్డు
=సరఫరా నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ తప్పని నీటి ఇబ్బందులు
సాక్షి, సిటీబ్యూరో : జలమండలి గ్రేటర్‌లో విలీనమైన శివారు ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోంది. మంచినీటి కోసం ఆయా ప్రాంతాలు విలవిల్లాడుతున్నా పట్టించుకున్న జాడే లేదు. ప్రధాన నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న వాటర్ బోర్డు.. శివారు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అనువైన పైప్‌లైన్ నెట్‌వర్క్, స్టోరేజి రిజర్వాయర్లు లేవన్న సాకును చూపి నెట్టుకొస్తోంది. కానీ సరఫరా నెట్‌వర్క్ ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, కాప్రా, ఉప్పల్, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలోని పలు కాలనీలకు వారానికోసారైనా మంచినీరు అందించకపోవడం గమనార్హం.
ఫలితంగా రోజువారీగా 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నామని లెక్కలు చూపుతున్న జలమండలి.. శివారు ప్రాంత అవసరాలను విస్మరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గ్రేటర్‌కు సరఫరా చేస్తున్న 340 మిలియన్ గ్యాలన్ల నీటిలో 40 శాతం మేర నీరు వృథా కావడంతో వాస్తవ సరఫరా 180 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదు. దీంతో పలు శివారు కాలనీల గొంతు తడవడం లేదు. తాగునీటి వృథాను అరికట్టి శివార్ల దాహార్తిని తీర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నా జలమండలి చెవికెక్కడం లేదు.
ప్రతిపాదనలకే పరిమితం
ఉపాధి అవకాశాలు, నివాస వసతులు పెరగడంతో గ్రేటర్ శివార్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతోపాటు జనాభా కూడా అనూహ్యంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కోర్‌సిటీ (ప్రధాన నగరం)లో 37 లక్షల జనాభా ఉంటే.. శివారు ప్రాంతాల్లో 40 లక్షల మేర జనాభా కేంద్రీకతమైంది. అదిప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మంచినీటికి డిమాండ్ బాగా పెరిగింది.
శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 31 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక్కడి అవసరాలకు ఇదికాక మరో 105 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమన్నది బోర్డు అధికారుల అంచనా. ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నెట్‌వర్క్ విస్తరణ, రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.2,400 కోట్లు అవసరమని ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పైసలు విదల్చకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
సరఫరా నెట్‌వర్క్ ఉన్నా అదే దుస్థితి
ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, కాప్రా, ఉప్పల్, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి తదిత ర శివారు ప్రాంతాల్లో పైప్‌లైన్ నెట్‌వర్క్, స్టోరేజి రిజర్వాయర్లున్నాయి. అయినా ఈ ప్రాంతాలకు నీటి సరఫరాలో చేయడంనూ జలమండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సుమారు 870 కాలనీల్లో మంచినీటి ఇక్కట్లు తీవ్రంగా ఉన్నట్లు జలమండలి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయమై ఆయా ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.