మహా ‘చెత్త’గా..
అధ్వానంగా పారిశుద్ధ్యం
నగర వాసులకు ప్రత్యక్ష నరకం
గుట్టలుగా పేరుకుపోయిన చెత్త
వీధులు దుర్గంధభరితం ‘అంటు’కోనున్న ‘వ్యాధులు’
ఇప్పటికే డెంగీ కేసులు నమోదు
సిటీబ్యూరో: మహా నగరం నాలుగు రోజులుగా ‘చెత్త’మయమైపోయింది. ఎటు చూసినా కుప్పలుగా చెత్త దర్శనమిస్తోంది. ప్రధాన రహదారులపైన కూడా కొండల్లా పేరుకుపోయింది. జీహెచ్‌ఎంసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీధులన్నీ చెత్త కుప్పలతో నిండిపోయాయి. ఓ వైపు ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటూ ప్రభుత్వం నగరాన్ని శుభ్రం చేసేందుకు కసరత్తు చేస్తుంటే... మరోవైపు కార్మికుల సమ్మెతో పరిస్థితి అదుపు తప్పింది. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో తొలగించిన చెత్తకు దాదాపు మూడింతలు మళ్లీ పోగయ్యింది. గత నాలుగు రోజులుగా చెత్తను తరలించేవారు లేక నగరం దుర్గంధభరితంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంటువ్యాధులు మొదలయ్యాయి. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈగలు ముసురుతున్నాయి. ఎక్కడికక్కడ కుళ్లిన చెత్తతో పరిస్థితి భయంకరంగా మారుతోంది. వర్షం లేకపోవడం కొంతలో కొంత ఉపశమనం. వర్షం పడితే పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఐదుగురికి పైగా డెంగీబారిన పడ్డారు. మరోవైపు మలేరియా కేసులూ పెరుగుతున్నాయి.
రహదారిపైనే...
ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లే మార్గంలో అశోక్ నగర్ చౌరస్తా వద్ద మినీ చెత్త తరలింపు కేంద్రం మొత్తం చెత్తతో నిండిపోయింది. దీంతో మిగిలినది రోడ్లపైనే పడేస్తున్నారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఆ మార్గంలో వెళ్లేవారు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితికి ఇది మచ్చుతునక. జీహెచ్‌ఎంసీలోని ఐదు జోన్లు, 18 సర్కిళ్లు.. దాదాపు 1500 బస్తీలు.. 900 కాలనీల్లో ఇదే దుస్థితి. ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో భారీగా చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ఒక్కరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిలిచిపోతేనే భరించలేని పరిస్థితి. అలాంటిది నాలుగు రోజులుగా చెత్త కదలకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే అవకాశం లేదు. కార్మికుల సమ్మెతో మిగతా కార్యక్రమాల సంగతిఅటుంచితే... పారిశుద్ధ్యం దారుణంగా దెబ్బతింది. ఇంటింటికీ వెళ్లి దోమల నివారణకు మందు చల్లే కార్మికులు సైతం విధులు బహిష్కరించారు. దీంతో దోమలు మరింతగా విజృంభించే పరిస్థితి నెలకొంది. డంపర్‌బిన్‌ల నుంచి చెత్త తొలగించేవారు లేకపోవడంతో వాటి వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
సమ్మెలోని యూనియన్లు ఇవీ....
సమ్మెలో పాల్గొన్న యూనియన్లలో సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, ఏఐయూటీయూసీ, టీఆర్‌ఎస్ కేవీ, టీఎన్‌టీయూసీలతోపాటు జీహెచ్‌ఎంఈయూ ఉన్నాయి. 16 డిమాండ్లతో ఇవి సమ్మె చేస్తున్నాయి.
కార్మికుల పక్షమే
జీహెచ్‌ఎంసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. వారి సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీనివ్వాలి. కనీస వేతనాన్ని రూ.16,500కు పెంచాలి. కార్మికులపై ప్రేమ ఉందని చెప్పిన మాటలను అమలు చేయాలి.
- యు.గోపాల్ (అధ్యక్షుడు, అధికార పార్టీ అనుబంధ యూనియన్ జీహెచ్‌ఎంఈయూ)
డిమాండ్లు తీర్చాల్సిందే
కార్మికుల డిమాండ్లు తీర్చేంత వరకు సమ్మె ఆగదు. అన్ని సర్కిళ్లలో శుక్రవారం అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహిస్తాం. అప్పటికీ పరిష్కరించకుంటే ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడతాం. జీహెచ్‌ఎంసీ కమిషనర్ మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఇప్పుడు చెల్లవంటున్నారు. కమిటీ వేయకుండా, పీఆర్ సీ వర్తింపజేయకుండా కాలయాపన చేస్తున్నారు. బెదిరింపులు మంచిది కాదు.
- శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీఎంఎస్
సమస్యలు పరిష్కరించాలి
వివిధ విభాగాల్లో కార్మికులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సేవలను తల్లి సేవలతో పోల్చిన సీఎం కేసీఆర్.. వారి సమస్యలు పరిష్కరించడంపై శ్రద్ధ చూపడం లేదు. వారికి పీఆర్‌సీ వర్తింపజేయాలి. ఉస్మానియాలో, వాటర్‌బోర్డులో సైతం ఉద్యోగులు తమ సమస్యల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరి సమస్యలూ తీర్చనందునే ధర్నాలు, ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఇకనైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.
- ఆనంద్ కుమార్ గౌడ్, టీడీపీ అధికార ప్రతినిధి
మే 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన స్వచ్ఛ హైదరాబాద్‌లో 6,316 మెట్రిక్ టన్నుల అదనపు చెత్తను తొలగించారు. నిత్యం వెలువడేది కాక అదనంగా ఉన్న దానిని తొలగించడంతో నగరం పరిశుభ్రంగా మారుతుందని అందరూ ఆశించారు.సాధారణ రోజుల్లో జీహెచ్‌ఎంసీ నుంచి నిత్యం 3,800 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రంజాన్, తదితర పండుగల సమయాల్లో అదనపు చెత్త వెలువడటం రివాజు. ఇలా నాలుగు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పోగుపడుతోంది. దీంతో దాదాపు 16వేల మెట్రిక్ టన్నులు పేరుకుపోయింది.