సమ్మెకు చెక్!
ఔట్‌సోర్సింగ్ కార్మికులకు బయోమెట్రిక్ హాజరు
సమయ పాలనపై దృష్టి జీహెచ్‌ఎంసీ నిర్ణయం
వేతనాల పెంపుపై త్వరలో ఉత్తర్వులు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కార్మికులు భవిష్యత్‌లో సమ్మెలో పాల్గొనకుండా నిషేధం విధించబోతున్నారు. ఔట్‌సోర్సింగ్ కార్మికుల హాజరు నమోదులో ఇకపై కచ్చితత్వాన్ని పాటించనున్నారు. మాన్యువల్ హాజరుతో పాటు బయోమెట్రిక్‌నూ అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె సందర్భంగా వేతనాల పెంపునకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ ఉత్తర్వులూ వెలువడనున్నాయి. వేతనాలు పెంచడమే కాదు... సక్రమంగా విధులు నిర్వర్తించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. వెటర్నరీ, రవాణా, ఎంటమాలజీ విభాగాల్లో 24 వేల మందికి పైగా ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. గత నెలలో వారు పది రోజులకు పైగా సమ్మెలో పాల్గొన్నారు. వారి డిమాండ్లపై స్పందించిన సీఎం వేతనాల పెంపునకు హామీ ఇచ్చారు. జూలై 16 నుంచే ఈ పెంపును వర్తింపజేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ జీవో కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇదే జీవోతో పాటు జీహెచ్‌ఎంసీ కొత్త నిర్ణయాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.
ఇవీ నిబంధనలు..
ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సాధారణ హాజరుతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి.కార్మికులు పనివేళలను తప్పనిసరిగా పాటిం చాలి. పనిలో అంకితభావం ఉండాలి.శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్‌ఎఫ్‌ఏ) తమ పరిధిలోని కార్మికులందరి హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవడంతోపాటు వారి ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. తమ పరిధిలోని చెత్తడబ్బాల ఫొటోలను ఏరోజుకారోజు అప్‌లోడ్ చేయాలి. తద్వారా కార్యాలయం నుంచే ఉన్నతాధికారులు వీటి పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది.ఎంటమాలజీ (దోమల నివారణ విభాగం)లోని కార్మికులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. చెత్తడబ్బాల బదులు వీరు చేసిన పనికి సంబంధించిన చిత్రాలు అప్‌లోడ్ చేయాలి.ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఎలాంటి సమ్మెల్లోనూ జోక్యం చేసుకోరాదు. స్వచ్ఛ హైదరాబాద్ దిశగా పనిచేయాలి.చెత్త రవాణా వాహనాలకు జీపీఎస్‌ను తప్పనిసరిగా అమర్చాలి. జీపీఎస్ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా డ్రైవర్లు, కార్మికులు బాధ్యత వహించాలి.