సాక్షి, అమరావతి: బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అందాల్సిన అత్యవసర సేవల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, ఈ చర్యను సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు.. ఎన్నికల ముందు బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో అంగన్‌వాడీలు సమ్మెకు దిగడాన్ని తప్పుబట్టాయి. అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నాయి. వాస్తవానికి దేశంలో అంగన్‌వాడీలకు ఎక్కువ వేతనాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, వీరి వేతనాల నిమిత్తం కేంద్రం కేవలం రూ. 1,800 మాత్రమే ఇస్తున్నా మిగతా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపాయి.
చాలా రాష్ట్రాల్లో వారికి ఇచ్చే వేతనం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు మాత్రమే ఉందని చెప్పాయి. కాగా, ఇప్పుడు అంగన్‌వాడీలను ఇష్టమొచ్చిన మాటలతో రెచ్చగొడుతున్న విపక్ష నేత చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న 2000వ సంవత్సరంలో ఉద్యోగులను గుర్రాలతో తొక్కించాడన్నది పచ్చి నిజం. మళ్లీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్ల పాటు వారికి కేవలం రూ. 4 వేలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత రెండున్నరేళ్లు రూ. 7 వేలు ఇచ్చారు.
అయితే అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీల వేతనాన్ని తెలంగాణతో సమానంగా పెంచుతామని 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే కొద్ది నెలల ముందు హడావుడిగా వారి వేతనాన్ని రూ. 10,500కు పెంచి దానిని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాన్ని రూ. 11,500కు పెంచి చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది తలెత్తినా ఎప్పుడూ ప్రభుత్వం వెనకడుగు వేయని ప్రభుత్వ పరిస్థితిని అంగన్‌వాడీలు అర్థం చేసుకోకపోవడం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
అందుకే ఎస్మా..
అత్యంత బలహీనులకు పౌష్టికాహార పంపిణీ తదితర సేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అంగన్‌వాడీలు ఆరు నెలల పాటు సమ్మె చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నెలలో 25 రోజుల చొప్పున ఏడాదిలో 300 రోజులపాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది.
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గత నెల 12 నుంచి సమ్మెకు దిగడంతో ప్రజల్లో అత్యంత బలహీనులైన వారికి పౌష్టికాహార పంపిణీలో అవరోధం ఏర్పడింది. ఇప్పటికే పలుమార్లు వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం వారి 11 డిమాండ్లలో 10 ఆమోదించి అమలుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ అంగన్‌వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీ నిలిచిపోయింది. పిల్లల గ్రోత్ మోనిటరింగ్ నిర్వహణ, ఇమ్యూనైజేషన్, ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు ఆగిపోయాయి.
సమ్మె కారణంగా 7.5 లక్షల ప్రీ స్కూల్ పిల్లలు అంగన్‌వాడీలకు రావడం తగ్గిపోయి ప్రస్తుతం రెండు లక్షలే వస్తున్నారు. కొత్తగా పిల్లల నమోదు కూడా ఆగిపోయింది. ప్రతి నెల సుమారు 45 వేల మంది గర్భిణులు, బాలింతలకు సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనార్థం తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్విసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్–1971(ఎస్మా)’ను ప్రయోగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు నెలలపాటు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.
ప్రోత్సాహకాలిస్తున్న ప్రభుత్వం ఇది..
♦ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని ఐదేళ్ల కాలంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ. 6,950, అంగన్‌వాడీ సహాయకులకు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ.3,900 మాత్రమే చెల్లించింది.
♦వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలున్నగురేళ్లుగా వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7 వేలు చొప్పున పెంచిన వేతనాలు అందిస్తోంది. అంతేగాక మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ఇస్తోంది. ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment