పొన్నాల కంటే ఉత్తమ్ ఎంపిక వరస్ట్
- సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- కాంగ్రెస్ దుస్థితికి ఉత్తమే కారణం
- ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ బతకదు
- కాంగ్రెస్ పరిస్థితిపై సోనియాకు లేఖ రాస్తా..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపిక వరస్ట్ అని సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘పీసీసీ అధ్యక్షునిగా నేనుంటే ఎన్నికల్లో గెలిపించేవాడిని. ఓడిపోతే పార్టీ పదవికి రాజీనామా చేసేవాడిని. నా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని భువనగిరి ఎంపీగా ఓడించడానికి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్తమ్ డబ్బులు ఇచ్చాడు. టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల్లో సవాల్ విసిరితే తప్పించుకున్న ఉత్తమ్.. పార్టీకి నాయకుడా? మంత్రి కేటీఆర్ చాలెంజ్ విసిరితే తీసుకోకుండా, తప్పించుకోవడానికి మీ నాన్న కేసీఆర్ రావాలని ఉత్తమ్ ఎలా అంటడు? ఇలాగైతే పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం ఏం కావాలి’ అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఎమ్మెల్యే పదవిని వదిలేస్తానని అన్నారు. నంది ఎల్లయ్య లాంటి వ్యక్తిని వరంగల్‌కు ఇన్‌చార్జీగా ఎలా వేస్తారని నిలదీశారు. టీఆర్‌ఎస్ కంచుకోటలో నంది ఎల్లయ్య ఏం చేస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
సారథ్య బాధ్యతలు ఇస్తే తీసుకుంటా..
పదవులకోసం తాను పాకులాడటం లేదని, రాష్ట్రంలో పార్టీ సారథ్య బాధ్యతలు ఇస్తే తీసుకుంటానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితిని చూస్తే గుండె తరుక్కుపోతున్నదన్నారు. గత సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పొన్నాల, ఉత్తమ్ నియామకాలే కారణమన్నారు. పొన్నాల కంటే ఉత్తమ్ ఇంకా వీక్ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ బతకదన్నారు. ఉద్యమంతో సంబంధంలేని పొన్నాలకు పదవి ఇవ్వడం తప్పయితే ఉత్తమ్‌ను పెట్టి మరో తప్పు చేశారని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్, పాలేరులో పార్టీ ఓటమికి ఉత్తమే కారణమన్నారు.
తెలంగాణ ఇవ్వడంతో సోనియాగాంధీ చాలా గొప్ప సాహసం చేశారని, అయితే తెలంగాణ ఇచ్చిన ఘనతను చెప్పుకోవడంలో రాష్ట్ర సారథులు వైఫల్యం చెందారని ఆరోపించారు. తెలంగాణకోసం కొట్లాడిన వారికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండదన్నారు. పార్టీకి సర్జరీ చేయాలని, కోటేసుకుని నాలుగు మాటలు మాట్లాడినోళ్లకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. ఎన్నికలకు ముందే పార్టీని నడిపించే నాయకుడిని ప్రకటించాలని కోరారు. ఇప్పటికే 15, 20 మంది నాయకులు సీఎం అభ్యర్థులమని పార్టీలో ప్రచారం చేసుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లు పెడితే ప్రయోజనం లేదని, ప్రజాక్షేత్రంలో కార్యకర్తలను ఉత్తేజం చేయాలని సూచించారు. మార్పులు చేయకుంటే పార్టీ మనుగడ కష్టమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ వ్యవహారాలపై సోనియాగాంధీకి లేఖరాస్తానని చెప్పారు. సీఎల్పీ నేత పనితీరును ప్రజలే విశ్లేషిస్తారని అన్నారు.