
మీ గొంతు మేమై..
కొత్త రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త పాలకులు వచ్చేశారు.. ఆరు నెలలు కావస్తోంది. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగానే ఉన్నాయి. ఈ తరుణంలో ‘సాక్షి’ ప్రజల పక్షాన నిలిచేందుకు వినూత్నంగా ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమాన్ని చేపట్టింది.. ప్రజల గొంతుకై నిలవాలని నిర్ణయించుకుంది..
నాయకులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్తోంది.. నేతలకు నేరుగా సమస్యలను తెలిపి సత్వర పరిష్కారానికి కృషి చేస్తోంది. ఆదివారం మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి బోయిన్‌పల్లిలో వీఐపీ రిపోర్టర్‌గా వ్యవహరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.
కంటోన్మెంట్: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ అయ్యారు. తాను పుట్టి పెరిగిన బోయిన్‌పల్లిలోని పలు బస్తీలో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కాలనీ మధ్య నుంచి వెళ్తున్న హైటెన్షన్ లైన్ కారణంగా నిత్యం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నామని, సమస్యను పరిష్కరించమని బాపూజీనగర్‌వాసులు కోరారు. మిలటరీ అధికారుల ఆంక్షలతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పెన్షన్‌లైన్‌వాసులు ఆయన దృష్టికి తెచ్చారు. అండగా ఉంటానని.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.