యువత చూపు.. వ్యవసాయ వ్యాపారం వైపు | Youth eye on Agricultural businesses | Sakshi
Sakshi News home page

యువత చూపు.. వ్యవసాయ వ్యాపారం వైపు

Published Wed, Mar 8 2017 3:37 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

యువత చూపు.. వ్యవసాయ వ్యాపారం వైపు - Sakshi

యువత చూపు.. వ్యవసాయ వ్యాపారం వైపు

దేశవ్యాప్తంగా 21,189 అగ్రి వెంచర్ల ఏర్పాటు
వెయ్యి ఎకరాల్లో కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్న కర్ణాటక యువకుడు  


సాక్షి, హైదరాబాద్‌: దేశంలో యువత వ్యవసాయ వ్యాపారం వైపు చూస్తోంది. అందులో శిక్షణ పొందుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మేనేజ్‌) ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మొదటి సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా అనేకమంది వ్యవసాయ వ్యాపార ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరంతా వ్యవసాయ కోర్సులు చేసి మేనేజ్‌ ఆధ్వర్యంలో అగ్రి క్లినిక్స్‌ (ఏసీ), అగ్రి బిజినెస్‌ సెంటర్లు (ఏబీసీ) పథకం కింద శిక్షణ పొందినవారే. వీరిలో మహారాష్ట్రకు చెందినవారు 23 శాతం, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు 21 శాతం ఉన్నారు. 2002 నుంచి 2017 వరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21,189 అగ్రి వెంచర్స్‌ ఏర్పాటయ్యాయి. అందులో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన యువత 5,394 అగ్రి వెంచర్లు ఏర్పాటుచేస్తే... తెలంగాణలో మాత్రం 363 మాత్రమే ఏర్పాటయ్యాయి.

32 రకాల వ్యవసాయ వ్యాపారాల్లో యువత
21,189 అగ్రి వెంచర్లలో అగ్రి క్లినిక్స్‌ 3,306, అగ్రి బిజినెస్‌ కేంద్రాలు 6,776 ఉండటం గమనార్హం. అలాగే డెయిరీ, పౌల్ట్రీ, పిగ్గరీ, గోటరీ యూనిట్లు 5,577 ఏర్పాటయ్యాయి. వ్యవసాయ యంత్రాల యూనిట్లు 713 ఏర్పాటయ్యాయి. విత్తన ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ యూనిట్లు 252, నర్సరీ 513, హార్టికల్చర్‌ క్లినిక్స్‌ 170, ఔషధ మొక్కల సాగు యూనిట్లు 112, చేపల అభివృద్ధి యూనిట్లు 350, పంటల ఉత్పత్తి యూనిట్లు 197 ఏర్పాటయ్యాయి. ఇలా 32 విభాగాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ మేనేజ్‌లో శిక్షణ పొందినవారే ఏర్పాటు చేయడం గమనార్హం.

కర్ణాటకకు చెందిన చెన్నకేశవశర్మ 80 గ్రామాల్లో 200 రైతులకు చెందిన వెయ్యి ఎకరాల్లో కాంట్రాక్టు వ్యవసాయం చేస్తూ రూ. 5 కోట్ల టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్నాడు. ఉత్తరాఖండ్‌ యువకుడు హరీందర్‌సింగ్‌ విత్తన ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ యూనిట్లు నెలకొల్పి రూ. 4 కోట్ల టర్నోవర్‌తో, ఉత్తరప్రదేశ్‌ మీరట్‌ యువకుడు అదేశ్‌కుమార్‌ ఔషధమొక్కలతో రూ. కోటిన్నర టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్నారు. కేరళ త్రిసూరుకు చెందిన యువతి అఖిలమోలె రూ. 50 లక్షల టర్నోవర్‌తో చేపల వ్యాపారం చేస్తోంది. ఆ రాష్ట్రంలో వ్యక్తిగతంగా ఎక్కువ చేపలు ఉత్పత్తి చేస్తోంది ఈమే కావడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement