
20న ప్రకాశం జిల్లాకు జగన్
- పీసీ పల్లె మండలం కిడ్నీ బాధిత ప్రాంతాల్లో పర్యటన
- జిల్లాలో రెండేళ్లలో 424 కిడ్నీ వ్యాధిగ్రస్తుల మరణాలు
సాక్షి, హైదరాబాద్: పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే ఆరోగ్యశ్రీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా విఫలమై ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 20వ తేదీన ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. 19న సీఆర్ డీఏ గ్రామాలకు వెళుతున్న జగన్ ఆ మర్నాడు ప్రకాశం జిల్లాకు వెళతారు. కనిగిరి శాసనసభా నియోజకవర్గంలోని పీసీ పల్లె మండలంతో పాటు పోలవరాన్నీ జగన్ సందర్శిస్తారు. కనిగిరి పరిసరాల్లో కిడ్నీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది.
పలువురు కిడ్నీ రోగులు సోమవారం హైదరాబాద్‌లోని జగన్ నివాసంలో కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి రోదన చూసి జగన్ చలించిపోయారు. తాను ఈ నెల 20న బాధి తుల వద్దకు వస్తానని, అక్కడ పర్యటించిన తరువాత కిడ్నీ రోగులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వారికి హామీ ఇచ్చారు. కిడ్నీ రోగులతో పాటుగా జగన్‌ను కలిసిన వారిలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, న్యాయవాది నాగిరెడ్డి ఉన్నారు.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా చేయించాలనే బృహత్తరమైన ఆశయంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అవుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిదర్శనం కనిగిరి ప్రాంత కిడ్నీ రోగులేనన్నారు. జనవరి 2015 నుంచి 2016 డిసెంబర్ వరకూ ప్రకాశం జిల్లాలో 424 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు చనిపోయారని, ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతవాసులను ఆదుకోవాలి కోరారు.
– వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ