
'ఆ విషపు మొక్కను పెంచింది చంద్రబాబే'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా కేంద్రంతో సఖ్యతగా ఉండి చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధించారని కోటంరెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో హామీలపై ఎందుకు అడగలేకపోతున్నారని కోటంరెడ్డి నిలదీశారు. రాష్ట్రం పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు నిరసన చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది కదా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. కేంద్రంతో సఖ్యత కొనసాగించకపోతే రాజధాని భూకుంభకోణం, ఓటుకు కోట్లు కేసులో విచారణ జరిగి చంద్రబాబు జైలుకెళ్లాల్సి వస్తుందన్నారు. ఆంధ్రా దావూద్ నయీం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు.
ఆ విషపు మొక్కను పెంచి పోషించింది చంద్రబాబేనని నిప్పులు చెరిగారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దని కోటంరెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా, పోలవరం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.