హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. అసెంబ్లీ లాంజ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలగింపుపై ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ జోహార్ అని నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వైఎస్ఆర్ ఫోటో తిరిగి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ సభ్యుల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల... సభ్యులు ఆందోళన విరమించి వారివారి స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. అయినా వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. సభలో ఏదైనా అంశంపై చర్చకు రావాలంటే ...వాయిదా తీర్మానం ద్వారానో, మరోద్వారానో రావాలని స్పీకర్ అన్నారు. కరువు, తాగునీటిపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ ...ఆ విషయాన్ని వదిలేసి వైఎస్ఆర్ ఫోటో తొలగింపుపై చర్చకు పట్టుపట్టడం సరికాదన్నారు.