ఏపీ శాసనసభ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను అక్కడే ఉంచాలని..
తొలగించిన వైఎస్ ఫొటోను అక్కడే ఉంచాలని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను అక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును శుక్రవారం కలవనున్నారు. ఉదయం 11 గంటలకు వారు ఆయనను అసెంబ్లీలో కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఇదే విషయమై వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు గత నెల 31న శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణరావు ఛాంబర్‌లో ధర్నా చేశారు. రెండు రోజుల్లోగా ఫొటోను ఏర్పాటు చేస్తామని అప్పట్లో వారికి కార్యదర్శి హామీ ఇచ్చారు. కానీ గడువు ముగిసినా ఫొటోను ఏర్పాటు చేయకపోగా, ఈ నెల 11న స్పీకర్ అధ్యక్షతన జరిగిన కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశంలో వైఎస్ ఫొటో ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అక్కడ మళ్లీ వైఎస్ ఫొటోను ఉంచాల్సిన అవసరం లేదని సమావేశానంతరం ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు.. వచ్చే శాసనసభా సమావేశాల ప్రారంభంలోగా వైఎస్ ఫొటోను తొలగించిన చోటే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పది రోజులు గడిచినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో శుక్రవారం స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి తమ డిమాండ్‌ను ఆయన ముందుంచాలని శాసనసభాపక్షం నిర్ణయించింది.