ఏపీ స్పీకర్ తీరు ఆశ్చర్యకరం
-అమ్ముడుపోయి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మూడు సార్లు కాపాడారు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న వ్యవహారాలు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడే విధంగానే ఆయన నిర్ణయాలన్నీ తీసుకున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం సభను నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘స్పీకర్‌పై మేం అవిశ్వాస తీర్మానం నోటీసును ఇస్తే నిబంధనల ప్రకారం 15 రోజుల తరువాత, చర్చకు చేపట్టాలి. యాభై మంది సభ్యులం బలపర్చిన తరువాత, మా సభ్యులందరికీ విప్‌లు అందజేయడానికి తగినంత సమయం ఇవ్వాలి. కానీ స్పీకర్ తాను ఛైర్‌లో ఉండగానే దగ్గరుండి ఆ నిబంధనను నిర్ద్వందంగా సస్పెండ్ చేసి అదే రోజు అప్పటికప్పుడే చర్చకు చేపట్టడం అందరి కళ్లముందరే జరిగింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టినపుడు కూడా అదే జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని మా సభ్యులకు విప్‌ను జారీ చేశాం. టీడీపీ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కాకుండా కాపాడటానికి స్పీకర్ డివిజన్ ఓటింగ్ లేకుండా మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయేలా చేసి ఆ ఎమ్మెల్యేలను కాపాడ్డం అందరమూ చూశాం.
ఇది హేయం కాదా!
‘చిట్ట చివరిలో బడ్జెట్ సమావేశాలు ముగియడానికి ముందు ఆ నాటికి సభలో ఆయా పార్టీల బలాబలాలను స్పీకర్ వెల్లడిస్తూ వైఎస్సార్‌సీపీ బలం 67 మంది ఎమ్మెల్యేలు అని పేర్కొన్నారు. ఇంతకన్నా హేయమైన పని, ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉందా.....! సభ నుంచి మా సభ్యురాలు రోజాను సస్పెండ్ చేశారు. పదిమంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వారంతా వెళ్లి అధికారపక్షం సభ్యుల స్థానాల వైపు కూర్చున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిపోయిన భూమా నాగిరెడ్డి అధికారపక్షం బెంచీల్లో కూర్చునే పీఏసీ నివేదికను ప్రవేశ పెట్టారు. (వైఎస్సార్‌సీపీలో ఉన్నపుడు పీఏసీ ఛైర్మన్‌గా ఇటీవలి వరకూ ఉన్నారు) ఇదంతా స్పీకర్ కళ్ల ముందరే జరిగింది. మా నుంచి వెళ్లి పోయిన కలమట వెంకటరమణ టీడీపీ బెంచీల్లో కూర్చుని ఉండగానే అక్కడి నుంచే మాట్లాడ్డానికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. టీడీపీ స్థానాల వైపు పదిమంది ఫిరాయించిన సభ్యులు కూర్చుని ఉంటే సభలో వైఎస్సార్‌సీపీ బలం 67 మంది అని స్పీకర్ చదువుతారు.నిజంగా ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? డబ్బులకు అమ్ముడు బోయిన ఆ ఎమ్మెల్యేలను కాపాడ్డానికే స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేగా మారిపోవడం ధర్మమేనా?
ప్రజలే బుద్ధి చెప్పాలి
వేరే పార్టీ బీఫామ్‌లపై గెలిచి తమ వైపునకు లాక్కున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే ధైర్యం చంద్రబాబుకు లేదు. వారిని అనర్హతకు కూడా గురి చేయరు. ఎందుకంటే వారిని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిపించుకుని తీసుకొస్తామన్న నమ్మకం వారికి లేదు. ఇంతకన్నా వీరు ప్రజల్లో ఓడిపోయారనడానికి నిదర్శనం ఏమైనా ఉందా? చంద్రబాబు స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని చేస్తున్న అన్యాయాలను రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని హృదయపూర్వకంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోలగట్ట వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, ఆర్.కె.రోజా, పీడిక రాజన్నదొర, చిర్ల జగ్గిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలు వి.విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, నల్లాసూర్యప్రకాష్, వాసిరెడ్డి పద్మ, వి.వేణుగోపాల కృష్ణయాదవ్, కె.కన్నబాబు పాల్గొన్నారు.