విపక్షం గొంతునొక్కి అధికార పక్షానికి రక్షణా?
హైదరాబాద్ : ఏకపక్షంగా అధికార పక్షానికి కొమ్ము కాస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నందుకు నిరసనగా స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి సభా నియమాలను ఉల్లంఘిస్తూ, సంప్రదాయాలను కాలరాస్తూ, అధికారపక్షం చర్యలకు వంత పాడుతున్నందుకు తాము అవిశ్వాసం పెడుతున్నామన్నారు.
సభలో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారని, చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి, స్పీకర్‌ను కోరేది ఒకటేనని, ప్రత్యక్ష ప్రసారాలను ఎడిట్ చేయకుండా ప్రసారం చేస్తే ఎవరు తప్పు చేశారో అర్థమవుతుందని ఆయన అన్నారు. స్పీకర్‌కు, పార్టీ కార్యకర్తకు తేడా లేకుండా పోతోందనే విషయాన్ని కోర్టులే చెబుతున్నాయన్నారు. స్పీకర్ స్థానంలో కూర్చునే ముందువరకు పార్టీ కార్యకర్తే గానీ, కూర్చున్న తర్వాత కూడా ఆ పార్టీకి వంత పాడితే సమంజసం కాదని స్పీకర్ అయిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేయాలని కోటంరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ... సీనియర్ అయిన సీఎంగారికి, జూనియర్ సభ్యుడిగా ఒక విన్నపం చేస్తున్నా..మా పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వచ్చారు. వాళ్లను ప్రలోభాలు పెట్టామని మేమంటున్నాం, కాదు అభివృద్ధి కోసమేనని మీరంటున్నారు. స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టాం.. అభివృద్ధి చూసి మీతో వచ్చిన ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారు, వాళ్లతో మీరు స్పీకర్‌కు మద్దతుగా ఓటేయించే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతున్నా? స్పీకర్‌గా ఉన్న వ్యక్తి సభలో తండ్రి పాత్ర పోషించకుండా ఏకపక్షంగా ఒక ప్రతిపక్షం గొంతు నొక్కే రీతిలో అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, అధికార పార్టీ రాజకీయాలకు రక్షణ కవచంగా వ్యవహరిస్తున్నారు. నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఒక్కో ప్రసంగానికి ఎంతమంది అడ్డుపడినా స్పీకర్ అడ్డుచెప్పరు. అదే మంత్రులు మాట్లాడుతుంటే మాత్రం అడ్డుపడరు. అధికారపక్షం సభ్యులు ఎన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడినా ఒక్క మాట కూడా అనరు.
సభానాయకుడు పెద్దన్న, ప్రతిపక్ష నేత చిన్నన్న పాత్రలో ఉంటారు. ఈ సభ చక్కటి నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకుని ఉండాలి. ఎన్ని విభేదాలున్నా ఈ సభలో అడుగుపెట్టిన తర్వాత సభ ప్రజా గుండె చప్పుళ్లకు ప్రతిరూపంగా ఉండాలి. మనం ఏర్పాటుచేసుకున్న నియమావళిని తుచ తప్పకుండా పాటించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ సభలో గత రెండేళ్లుగా జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే, అందులో కూడా మనం రాసుకున్న నియమ నిబంధనలను శాసనసభ సాక్షిగా, మీపైన ఉన్న సత్యమేవ జయతే సాక్షిగా ఉల్లంఘించారు. దాన్ని ప్రజలంతా చూస్తున్నారు. మాలాంటి కొత్త సభ్యులు నిబంధలనలు ఉల్లంఘిస్తే మాకు నీతులు చెప్పాల్సిన శాసనసభా వ్యవహారాల మంత్రి అడుగడుగునా.. (ఆ సమయంలో యనమల అడ్డుపడ్డారు) గతం, వర్తమానం గురించి మాట్లాడకుండా భవిష్యత్తు గురించి మాట్లాడలేం.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లైబ్రరీలో పుస్తకాలు చదివినప్పుడు ఆనాటి సభలో తరిమెల నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ ఒక మాట అంటారు. సమావేశాలు బాతాఖానీ కబుర్లుగా మారిపోతున్నాయి. సభలు దారి తప్పినప్పుడు ప్రజాస్వామ్యానికే మచ్చ అవుతుందని, సభకు రాజీనామా చేసి, మళ్లీ సభలో అడుగుపెట్టనని వెళ్లిపోయారు. నాగిరెడ్డి పార్లమెంటరీ ప్రజావ్యవస్థపై బాధతో వెళ్లారా, సభలో జరిగిన పరిణామాలతో వెళ్లారా అనేది తెలియడంలేదు. అసలు నేను ఈ సభలో ఎందుకు ఉండాలి, ఈ సభ ప్రజా గుండె చప్పుళ్లకు అనుగుణంగా ఉంటోందా అనే ఆందోళన వస్తోంది.
అధికార పక్షమే దానికి కారణమని మమ్మల్ని నిందించవచ్చు. ఎవరి మాటలు నిజాలో తెలియాలంటే మనమధ్య వాదనలొద్దు. ప్రత్యక్ష ప్రసారాలు చూస్తే చాలు. ఈమధ్య కాలంలో దాన్ని కూడా ఎడిట్ చేస్తున్నారు. ఈ సభలో మాటల తూటాలు పేలుతున్నాయి. పార్లమెంటరీ భాషకు బదులు బూతులు వస్తున్నాయి కాబట్టి ఎవరు ఒప్పో, ఎవరు తప్పో తేలాలంటే వాదనలు, విభేదాలు వద్దు.. సంఘటనను యథాతథంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఎవరు తప్పు చేస్తే వారికి ప్రజలు శిక్షలు వేస్తారు. మా బాధంతా ఒక్కటే. స్పీకర్ తండ్రి స్థానంలో ఉన్నారు. పెద్దన్న స్థానంలో ఉన్న సభా నాయకుడు అన్నిరకాలుగా నియమాలను బుల్డోజ్ చేస్తున్నారు, స్పీకర్‌ను కూడా ప్రభావితం చేస్తున్నారు.
నేను అన్నమాట ఒక్కటి తప్పయినా ఈ క్షణమే పదవికి రాజీనామా చేస్తాను, మళ్లీ జీవితంలో సభలోకి అడుగుపెట్టను. మేం కొత్త సభ్యులం కాబట్టి మేం ఆవేశపడితే అర్థం ఉంటుంది గానీ, ముఖ్యమంత్రి చాలా సీనియర్ సభ్యుడు. 1978 నుంచి 2014 వరకు చంద్రబాబు సభ్యుడిగా ఉన్నారు. ఈ సభ దాదాపు రెండేళ్లుగా సాగుతోంది. ఇటీవల మా సభ్యురాలు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అలా చేయొచ్చని నియమ నిబంధనలుండే అనేక పుస్తకాలు చదివినా, ఎక్కడా లేదు. పిచ్చపిచ్చగా ఉందా, మీ కథ తేలుస్తా, మీ సంగతి తేలుస్తానని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు నిజమా కాదా?. నిన్నటి రోజున వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఏకపక్షంతో వ్యవహరించిన మాట వాస్తవమా కాదా?. చంపేసి సమాధి కట్టేస్తానని ఓ సభ్యుడు రికార్డుల పూర్వకంగా మాట్లాడితే వాళ్లమీద చర్యలు లేవు. స్పీకర్ గారికి వాళ్లమీద చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా రావట్లేదు. వైఎస్ఆర్‌సీపీ సభ్యుల మీద మాత్రం ఎంతమందిని సస్పెండ్ చేయాలా అన్న ఆలోచనే ఉంటోందని' అన్నారు.