దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించారని వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు.
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించారని వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రాజెక్టులపై చర్చలో నెహ్రూ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం కోసం వైఎస్ఆర్ తపించారని చెప్పారు.
కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు అందించేందుకు వైఎస్ఆర్ ఎంతో కృషిచేశారని నెహ్రూ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ బస్సు యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం పులివెందులకు 2 టీఎంసీలు ఇచ్చామంటున్నారని, ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఇచ్చారని, వైఎస్ఆర్ చేసిన కృషి వల్లే నీళ్లు ఇవ్వగలిగారని నెహ్రూ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు అందించి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమపై వాస్తవాలు చెప్పాలని, రాయలసీమ ప్రజలను మభ్యపెట్టరాదని హితువు పలికారు. ఈ సమయంలో అధికార పార్టీ సభ్యుల అరుపులు, కేకలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ సీపీ నాయకులపై చంద్రబాబు ఎదురుదాడి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్పై ఆరోపణలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.