హైదరాబాద్: అసెంబ్లీ లాంజ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫొటోతో సహా మిగిలినవారి ఫొటోలు కూడా తిరిగి ఆయా స్థానాల్లో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై శుక్రవారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్ కోడెల శివప్రసాద్రావుతో సమావేశమైయ్యారు. అనంతరం జ్యోతుల నెహ్రు విలేకర్లతో మాట్లాడుతూ... దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్న స్పీకర్ సమాధానంతో తమకు అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు.
అసెంబ్లీ ఆధునీకరణ పనులు జరుగుతున్నందునే ఆ ఫొటోలన్నీ పక్కన పెట్టామని స్పీకర్ చెప్పారు. అయితే ఎప్పట్లోగా తిరిగి ఆ ఫొటోలు ఏర్పాటు చేస్తారని తాము అడిగిన ప్రశ్నకు స్పీకర్ దాటవేత ధోరణితో వ్యవహరించారని జ్యోతుల నెహ్రు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను పక్కదోవపట్టించేందుకు టీడీపీ రాజకీయ ఎత్తుగడను అనుసరించిందని విమర్శించారు. ప్రజాసమస్యలపై తెలుగుదేశం పలాయనం చిత్తగించేలా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తన స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారని జ్యోతుల నెహ్రు అన్నారు.