ఎస్టీ. ఎస్టీ, మైనార్టీల సంక్షేమమిదేనా?
బడ్జెట్‌లో పూర్తి అన్యాయం చేశారని ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌లోనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పూర్తి అన్యాయం జరిగిందని, ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తుంటే గత ప్రభుత్వాలు, అప్పటి సీఎం వైఎస్ ఇందుకు కారణమని నిస్సిగ్గుగా అధికార పక్షం ఎదురుదాడికి దిగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, అంజాద్ బాషా, జలీల్‌ఖాన్, వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు.
డేవిడ్‌రాజు మాట్లాడుతూ... దళితులకు వైఎస్ హయాంలో అన్యాయం జరిగిందని, ఎస్సీలు వివక్షతకు గురయ్యారని మంత్రి రావెల సభలో చెప్పడాన్ని ఆక్షేపించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దళిత బంధువెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఎస్సీల సంక్షేమానికి చంద్రబాబు ఏదో చేస్తున్నారని చెప్పేందుకు రావెల నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు ప్రకటించేటప్పు డు ఎస్సీ, ఎస్టీ ఖాళీలను పేర్కొనట్లేదని సభ దృష్టికి తెస్తే మంత్రి దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంజాద్ బాషా మాట్లాడుతూ... మైనార్టీ సంక్షేమానికి కట్టుబడాల్సిన ప్రభుత్వం గతంలో అది చేశాం.. ఇది చేశామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతోందని విమర్శించారు. వాస్తవానికి బడ్జెట్‌లో మైనార్టీలకు రూ.371కోట్లు కేటాయించినట్లు చూపుతోందని, కానీ మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు అన్నీ పోనూ కేవలం కేటాయించింది రూ.మూడున్నర కోట్లు మాత్రమేనన్నారు. ఈ కేటాయింపులపై సీఎం జవాబు చెప్పాలన్నారు. మైనార్టీల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే మంత్రి నారాయణను ఎలా ప్రమోట్ చేశారో.. అలా ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నిం చారు.
మైనార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి అమానుషంగా వ్యవహరించారంటూ జలీల్‌ఖాన్ అన్నారు. మైనార్టీలకు కేటాయింపుల్లో జరిగిన అవమానాన్ని ఎలుగెత్తి చెప్పేందుకు అడుగడుగునా అడ్డుకుంటున్న అధికార పార్టీ సభాసంప్రదాయాల గురించి పదేపదే పేర్కొనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుం దన్నారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ఏపీ వికేంద్రీకరణ దిశగా అభివృద్ధి చేయాలన్నారు. వెనుకబడిన రాయలసీమను విస్మరిస్తే ఉద్యమాలు మొదలవుతాయన్నారు.
ఎస్సీ, ఎస్టీ పోస్టుల భర్తీ ఎప్పుడు?
ఎమ్మెల్యే పాలపర్తి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర విభజన జరిగి కొత్త ప్రభుత్వం వచ్చినా ఉద్యోగుల ఖాళీల వివరాలు ప్రకటించలేదని తప్పుపట్టారు. రాష్ట్రంలో 4,300 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి చెప్పారని, వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉన్నట్టు తమకు సమాచారముందన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల పంపిణీకోసం నియమించిన కమలనాథన్ కమిటీ లెక్కప్రకారం రాష్ట్రంలో, సచివాలయం స్థాయి లో 20,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలిం దని, ఈ నెల 21న ఉద్యోగుల్ని పంపిణీ చేసినా ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీలవెన్నో తెలుపలేదన్నారు. తమకున్న సమాచారం ప్రకారం ఖాళీ పోస్టుల్లో 15 వేలకుపైగా ఎస్సీ,ఎస్టీలకు చెందినవన్నారు. ఇది నిజమో కాదో చెప్పాలని, ఎస్సీ,ఎస్టీల బ్యాక్‌లాగ్ పోస్టులు ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని కోరారు. మంత్రి రావెల కిషోర్‌బాబు స్పందిస్తూ.. త్వరలో పరిశీలించి సమాధానం చెబుతామన్నారు.