పది కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు ఫట్!!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు పదికోట్ల వరకు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్లు పాకిస్థాన్లో ఆగిపోనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన 28 రోజుల గడువు లోగా వినియోగదారుల వివరాలను పరిశీలించడం తమ వల్ల కాదని ఆపరేటర్లు చేతులు ఎత్తేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. మొత్తం పరిశీలించాలంటే కనీసం 150-200 రోజుల గడువు కావాలని ఆపరేటర్లు కోరారు. లేనిపక్షంలో ప్రస్తుతమున్న ప్రీపెయిడ్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
పాకిస్థాన్లో మొత్తం 14 కోట్ల మొబైల్ కనెక్షన్లున్నాయి. వాటిలో కేవలం 10 శాతం మాత్రమే పోస్ట్ పెయిడ్. డిసెంబర్ 16 నాటి పెషావర్ స్కూలు దాడి తర్వాత మొత్తం ప్రీపెయిడ్ కనెక్షన్లన్నింటినీ మళ్లీ వినియోగదారుల వివరాలు పరిశీలించాలని పాక్ హోం శాఖ ఆదేశించింది. అక్కడున్న ఐదుగురు ఆపరేటర్లు... మొబిలింక్, యుఫోన్, టెలినార్, వారిద్, జాంగ్ సంస్థల ప్రతినిధులు హోంశాఖ మంత్రి నిస్సార్ అలీఖాన్తో భేటీకానున్నారు. అప్పుడు దీనికో పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.