
తథిగిణతోం థౌజండ్‌వాలా
రోబోలిప్పుడు చేయలేని పనులు లేవనుకోండి.
రోబోలిప్పుడు చేయలేని పనులు లేవనుకోండి. అయినా ఒక్కసారిగా వెయ్యి రోబోలు నాట్యం చేయడం.. అది కాస్తా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడం.. ‘వావ్’ అనుకునే విషయమే కదా! చైనాలోని డబ్ల్యూఎల్ టెక్నాలజీ అనే కంపెనీ ఈ ఘనతను సాధించింది. ఈ కంపెనీ డోబీ పేరుతో రోబోలు తయారు చేస్తుంది. దాదాపు 47 సెంటీమీటర్ల ఎత్తుండే వెయ్యికిపైగా డోబీలను ఒకదగ్గర నిలబెట్టి సంగీతానికి అనుగుణంగా ఆ కంపెనీ వారు డ్యాన్స్ చేయించారు. అన్ని రోబోలను ఒకే మొబైల్‌ఫోన్‌తో నియంత్రించడం ఒక విశేషమైతే.. దాదాపు 1,069 రోబోలు చివరివరకూ డ్యాన్స్ చేస్తూ కనిపించాయి.
మధ్యలో పడిపోయిన వాటిని లెక్కలోకి తీసుకోకపోయినా ఇంత పెద్ద సంఖ్యలో రోబోలు డ్యాన్స్ చేయడం రికార్డేనని గిన్నిస్ బుక్ తాలూకూ సంస్థ నిర్ధారించింది. ఇంకో విషయం ఏడాది కాలంలో చైనాలో ఇలాంటి రోబో డ్యాన్సులు బోలెడన్ని జరిగాయట. రికార్డు ççసృష్టించడం కోసం ముందుగా 2016లో యూబీటెక్ అనే సంస్థ 540 రోబోలతో ఓ ప్రయత్నం చేస్తే ఆ తరువాత కొద్దికాలానికే ఎవర్‌విన్ అనే కంపెనీ 1,007 రోబోలతో ఈ ఫీట్ సాధించింది. తాజాగా డబ్ల్యూఎల్ టెక్నాలజీ ఈ రికార్డునూ చెరిపేసి కొత్తది çసృష్టించిందన్నమాట.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్