భవనం నుంచి ఎగసిపడుతున్న మంటలు
- మరో ఐదుగురికి గాయాలు
జెడ్డా/న్యూఢిల్లీ: సౌదీఅరేబియాలో జరిగిన అ గ్నిప్రమాదంలో 11 మంది భారతీయులు చని పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుకాగా ముగ్గురు కేరళీయులు, బిహార్, తమిళనాడులకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు ఏ రాష్ట్రానికి చెందినవారనేది తెలియరాలేదు.
ఈ విషాదం నజ్రాన్ నగరంలో చోటుచేసుకుంది. పక్కన ఉన్న కారాగారంలో ఎగిసిన మంటలు కార్మికులు నివసిస్తున్న ఇంటిని చుట్టుముట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు నివసిస్తున్న ఇంటికి కిటికీలు కూడా లేకపోవడంతో ఊపిరాడక మరణించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటన విషయమై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే గురువారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ ఈ ఘటన వివరాలను వెల్లడించారు. జెడ్డాలోని భారతీయ రాయబార కార్యాలయం బాధితులకు అన్నిరకాలుగా చేయూత ఇస్తోందన్నారు. మరోవైపు ఇదే అంశంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందిస్తూ నజ్రాన్ అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం తనకు అందిందని, జెడ్డాలోని భారతీయ రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడానని చెప్పారు.
‘నజ్రాన్ గవర్నర్‌తో మన కాన్సులర్ జనరల్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి నుంచి నాకు సమాచారం అందుతోంది’ అని అన్నారు. అగ్నిప్రమాదంలో చనిపోయినవారిని గౌరీశంకర్ గుప్తా, కమపాలన్ సత్యన్, బైజు రాఘవన్, శ్రీజిత్ కొట్టస్సేరి, తబ్రేజ్‌ఖాన్, అతీక్ అహ్మద్, వసీం ఆక్రమ్, వకీల్ అహ్మద్, పరాస్‌కుమార్ సుబేదార్, మహ్మద్ వజీం అజీజూర్ రెహమాన్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులను గుర్తించాల్సి ఉంది.