సౌదీ అరేబియా పర్యాటకాన్ని పెంచే దిశగా భారతీయ పౌరుల కోసం కొత్త వీసా ఎంపికలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇందులో స్టాప్‌ఓవర్ వీసాలు, ఈవీసాలు, వీసా ఆన్ అరైవల్ వంటివి ఉన్నాయి. 2024 చివరి నాటికి సౌదీ అరేబియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలని ఈ కొత్త వీసాలను ప్రవేశపెట్టడం జరిగింది.
భారతీయులు ఇప్పుడు స్టాప్‌ఓవర్ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా 96 గంటలు చెల్లుతుంది. ఈ వీసాను సౌదియా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా 90 రోజులు ముందుగానే పొందవచ్చు. దీనికోసం నామినల్ ఫీజు వంటివి చెల్లించాల్సి ఉంటుంది.
యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా స్కెంజెన్ దేశం నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఈవీసా పొందటానికి అర్హులు. ఈ దేశాలలో శాశ్వత నివాసితులు లేదా సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన తేదీ కంటే కనీసం మూడు నెలల చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవీసా అధికారిక పోర్టల్ ద్వారా దీనిని పొందవచ్చు.
ఈవీసా కోసం అవసరమైన ప్రమాణాలు ఉన్నవారు.. వీసా ఆన్ అరైవల్ కూడా పొందవచ్చు. యూఎస్, యూకే, స్కెంజెన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలు కలిగిన వారికి మాత్రమే కాకుండా ఈ దేశాలలో శాశ్వత నివాసితులకు వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. దీని కోసం సౌదీ విమానాశ్రయాల్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్‌లు లేదా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.
సౌదీ అరేబియా భారతీయ పౌరుల కోసం అందిస్తున్న ఈ వీసాల కోసం.. ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్‌లలోని 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలలో అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరిన్ని నగరాల్లో కూడా ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. సౌదీ విజన్ 2030లో భాగంగా 2030నాటికి 75 లక్షల మంది ప్రయాణికులను సౌదీ అరేబియా ఆహ్వానించనుంది.
Comments
Please login to add a commentAdd a comment