న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసి స్విస్ బ్యాంకులో అక్రమంగా నల్లధనాన్ని దాచిన వ్యక్తులు, సంస్థలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) కేసులు నమోదు చేసింది. హెచ్‌ఎస్‌బీసీ జెనీవా బ్యాంకు జాబితా ఆధారంగా ఐటీశాఖ ఇలా మొత్తం 121 కేసులను నమోదు చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పన్ను ఎగవేసి సుమారు రూ.4,800 కోట్లమేర డబ్బును అక్రమంగా ఈ బ్యాంకులో దాచారని ఐటీశాఖ గుర్తించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, గోవాల్లోని కోర్టులో ఐటీశాఖ 2014-15 ఆర్థిక సంవత్సరం ముగింపురోజైన మార్చి 31న ఈ కేసులను దాఖలు చేసింది. నల్లధనంపై సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి కూడా ఈ వివరాలను పంపినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.