
4,30,000 ఏళ్ల క్రితమే మానవుల ఘర్షణ
ఈ భూమ్మీద తొలిసారిగా మానవ హత్య ఎప్పుడు జరిగిందో తెలుసా?
ఈ భూమ్మీద తొలిసారిగా మానవ హత్య ఎప్పుడు జరిగిందో తెలుసా? 4,30,000 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుందని శాస్త్రజ్ఞుల అంచనా. ఈ హత్యకు సంబంధించిన ఆధారాల్ని పరిశోధకులు ఇటీవల గుర్తించారు. స్పెయిన్‌లో లభించిన ఓ మానవ పుర్రె ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ధరణకొచ్చారు. పురాతత్వ శాఖ నివేదిక ప్రకారం ఈ పుర్రె పైభాగంలో ప్రాణాంతకమైన ప్రమాదకర గాయాలున్నాయి. ఉత్తర స్పెయిన్‌లోని సిమా డి లాస్ హ్యూసోస్ ప్రాంతంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఇక్కడి భూ గర్భంలోని గుహల్లో 4,30,000 సంవత్సరాలనాటి పుర్రెతో పాటు అదే కాలానికి చెందిన మరో 28 అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇరవయ్యేళ్లుగా ఈ ప్రదేశంలో జరిగిన పలు తవ్వకాల్లో ఇప్పటివరకు మొత్తం 52 వరకు పుర్రెలకు సంబంధించిన భాగాలు లభించాయి. వీటిల్లో దొరికిన ఓ పుర్రె ఎముకపై ఎడమ కంటి భాగంలో బలమైన రెండు గాయాలున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోరెన్సిక్ సాంకేతికత ద్వారా పుర్రెపై ఉన్న రెండు గాయాలు ఒకే వస్తువు ద్వారా జరిగాయని పరిశోధకులు కనుగొన్నారు.
దీన్నిబట్టి వ్యక్తుల మధ్య హింస జరిగి ఉండవచ్చని, అది హత్యకు దారి తీసి ఉండొచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. కేవలం పదమూడు మీటర్ల లోతైన గొయ్యి ద్వారానే అస్థిపంజరాలు లభించిన గుహల్లాంటి ప్రదేశానికి చేరుకోగలం. అయితే అలాంటి క్లిష్టమైన ప్రదేశానికి ఆ మానవ మృతదేహాలు ఎలా చేరి ఉంటాయనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు.