
కోట భారు సమీపంలోని పెంగకలన్ చెపాలో శనివారం నీటమునిగిన ఇంటిలోకి వెళుతున్న ఒక వ్యక్తి.
కౌలాలంపూర్: గత పది రోజులుగా వరదలు మలేసియాను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల నీటితో ఎనిమిది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు స్థంభించాయి. ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. దాదాపు లక్షా 32వేల మంది ప్రజలు ముంపుబారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా కిలంటన్, తెరెన్‌గాను, పహంగ్, జోహర్, పెరెక్, నెగ్రిసెంబిలాన్ రాష్ట్రాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. పెర్లిస్, కేదాహ్‌లో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు.మలేషియా చరిత్రలో ఇంతటి వరదలు ఎప్పుడూ రాలేదని అంటున్నారు.
కెలాంటన్‌లో 81వేల 925 మంది, తెరెన్‌గానులో 35 వేల మందికిపైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వరదబాధితులకు సహాయం నిమిత్తం మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ అదనపు నిధులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు.