గాల్లో వాషింగ్ మెషిన్‌లా వణికిన విమానం
దడ దడమంటూ పెద్ద శబ్దాలు చేస్తూ కూలిపోతుందేమో అన్నంత ఉత్కంఠకు గురి చేసింది. చివరకు ఆ విమానాన్ని తిరిగి ఆస్ట్రేలియాకు తిప్పి పైలట్ దించేయడంతో ప్రయాణీకులంతా ఊపిరిపీల్చుకున్నారు. సురక్షితంగా దింపిన పైలట్‌కు అంతా అభినందనలు తెలిపి కొంతమంది ఆలింగనాలతో, షేక్ హ్యాండ్‌లతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఎయిర్‌ఏసియా ఎక్స్ అనే ప్యాసింజర్ విమానం ఒకటి ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరింది.
అది గాల్లో ఉండగానే అనూహ్యంగా క్యాబిన్‌లో నుంచి ఒక రకమైన వాసన రాగా.. విమానం కిటికీలో నుంచి చూడగా రెక్కకు కొన భాగంలో మంట కనిపించింది. అంతలోనే విమానం మొత్తం భారీ మొత్తంగా ఊగిపోవడం మొదలైంది. దీంతో అంతా భయంభయంగా అరవడంతోపాటు ఒకరినొకరు గట్టిగా పట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం కొందరైతే సెల్ఫీలకు ట్రైచేయడం, ఇంకొంతమంది తమ ఇష్టమైన దైవాలను ప్రార్థించడం మొదలుపెట్టారు. అయితే, చివరకు ఎలాంటి హానీ జరగకుండా పైలట్ దానిని దింపేశాడు. విమానం వచ్చే సమయానికే ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక పోలీసులంతా కూడా ఫైరింజన్లు, వాటర్ కెనాన్లతో సిద్ధంగా ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు ఎయిర్ ఏషియా తెలిపింది.