అడవుల్లో అద్భుతాన్ని కనిపెట్టిన బాలుడు!
మెక్సికో: శాటిలెట్ ఫొటోల ఆధారంగా ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. దట్టమైన అడవుల్లో నిక్షిప్తమైన, ఎవ్వరికీ కనపడకుండా మరుగున పడిపోయిన మయన్ నగరాన్ని గుర్తించాడు. మాయ నాగరికతకు చెందిన చరిత్ర ఆధారంగా పరిశోధనలు చేశాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన మెక్సికన్ పర్వత ప్రాంతంలో వేల ఏళ్ళనాడు మరుగున పడిపోయిన నగరాన్ని 15ఏళ్ళ విలియమ్స్ గడౌరీ గుర్తించాడు. ఇప్పటివరకూ పరిశోధకుల కంట కూడ పడని దట్టమైన అడవులు, కొండలు, గుట్టల్లో దాగి ఉన్న ఆ అద్భుత 'మాయ' నగరాన్ని శాటిలెట్ చిత్రాల ద్వారా గుర్తించిన బాలుడు... ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రాచీన కళలు, సంస్కృతి ప్రతిబింబించే కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఇప్పుడా నగరంలో బయటపడి, వేల యేళ్ళ చరిత్రకు ఆనవాళ్ళుగా మారాయి.
2014 సంవత్సరంలోనూ పురావస్తు శాఖ వారు రెండు పురాతన పట్టణాలను కనుగొన్నారు. అయితే అప్పట్లో అడవుల్లో దాగి ఉన్న ఈ నగరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా ఆ అదృశ్య నగరాన్ని గుర్తించినట్లు విలియమ్స్ గడౌరీ చెప్తున్నాడు. మాయ నాగరికత నాటి నిర్మాణాలన్ని మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, పర్వతాల నడుమే ఉన్నట్లు తెలుసుకున్న అతడు... అలా ఎందుకు నిర్మించేవారో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ విషయంపై అధ్యయనాలు ప్రారంభించాడు. ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా పూజించేవారని తెలుసుకుని ఆదిశగా అధ్యయనాలను మొదలు పెట్టాడు.
నక్షత్రాల ఆధారంగా నగరాలను గుర్తించవచ్చన్న కోణంలో అడుగులు వేశాడు. గడౌరీ అనుకున్నట్లుగానే ఇప్పటిదాకా గుర్తించిన నగరాలన్నీ 22 నక్షత్ర సమూహాల స్థానంలోనే ఉన్నట్లు గుర్తించాడు. కానీ ఇంతకు ముందు పరిశోధకులు గుర్తించిన వాటిలో ఓ నగరం మిస్ అయినట్లు తెలుసుకున్న అతడు.. గూగుల్ ఎర్త్ ఆధారంగా పరిశోధనలు కొనసాగించి, రాడార్ శాట్-2 ఉపగ్రహ చిత్రాలద్వారా అడవుల్లో దాగిఉన్న అద్భుతాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రులు అడుగు పెట్టలేని అ మారుమూల యుకాతాన్ అడవుల్లోని నగరానికి తాను.. కాక్ చి అని గాని, మౌత్ ఆఫ్ ఫైర్ అనిగాని కొత్త పేరు పెట్టాలని కూడ భావిస్తున్నాడు.
అయితే ఆ నగరం మానవ నిర్మితంగానే కనిపిస్తోందని, అయితే ప్రపంచం ఈ నంగరం ద్వారా కొత్త ఆవిష్కణను చూసే అవకాశం ఉందని న్యూ బ్రున్స్విక్ విశ్వవిద్యాలయం రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ ఆర్మాండ్ లా రాక్యూ చెప్తున్నారు. శాటిలెట్ చిత్రాల్లోని ఒక ఫొటో అక్కడి నిర్మాణాలు చతురస్రాకారంలో పిరమిడ్ ను పోలి ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. విలియమ్స్ కనుగొన్న పద్ధతిలో మాయన్ నగరం ఆధారంగా పురాతత్వవేత్తలు మరిన్ని నగరాలను కూడ గర్తించే అవకాశం ఉందన్నారు. తన కొత్త ఆవిష్కరణలను సైంటిఫిక్ జనరల్ లో ప్రచురించిన విలియమ్స్... 2017 లో జరిగే బ్రెజిల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించనున్నట్లు కూడ తెలుస్తోంది.