బీజింగ్: ఎత్తైన కొండల శిఖరాగ్రాలపై వంతెనలను నిర్మించడంలో ప్రపంచంలో తనకు సరిలేరు మరెవ్వరూ అని ఇప్పటికే నిరూపించుకున్న చైనా ఇప్పుడు ఆసియాలోనే అతి పెద్దదైనా, అతి పొడవైన వంతెనను నిర్మించి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. దక్షిణ చైనాలోని యున్నన్ ప్రావిన్స్‌లో లాంగ్‌జియాంగ్ నదిపై రెండు కొండల శిఖరాగ్రాలపై ఈ వంతెనను నిర్మించింది. దీని పొడువు 8 వేల అడుగులు కాగా, ఎత్తు 920 అడుగులు.
ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం ఇప్పుడు పూర్తయింది. 1510 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెనను మే 1వ తేదీన ప్రారంభిస్తున్నారు. మొట్టమొదటి సారిగా డ్రోన్ ద్వారా వంతెనను, పరిసర ప్రాంతాలను చిత్రీకరించి ప్రపంచ మీడియాకు విడుదల చేశారు. ఈ వంతెనపై ప్రయాణిస్తూ చుట్టూవున్న కొండలు, లోయల అందాలను ఆస్వాదించవచ్చు. కిందకు చూస్తే మాత్రం ఊపిరి ఆగిపోయినంత పనవుతుంది.