
పాక్ ప్రధానిగా అబ్బాసీ ప్రమాణం
పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేత షాయీద్ కఖాన్ అబ్బాసీని దేశ ప్రధానిగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మంగళవారం ఎన్నుకుంది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేత షాయీద్ కఖాన్ అబ్బాసీని దేశ ప్రధానిగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మంగళవారం ఎన్నుకుంది. నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. సభలో మొత్తం 321 ఓట్లకు గాను అబ్బాసీకి 221 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన నవీద్‌కు 47 ఓట్లు, తెహ్రికీ ఇన్సాఫ్ నేత రషీద్ అహ్మద్‌కు 33 ఓట్లు, జామాత్ ఈ ఇస్లామీ నేత తరీఖుల్లాకు నాలుగు ఓట్లు పోలయ్యాయి.అనంతరం అధ్యక్షుడి భవనంలో జరిగిన కార్యక్రమంలో అబ్బాసీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి: అబ్బాసీ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తన తండ్రి 1988లో మృతి చెందడంతో రాజకీయ అరంగేట్రం చేశారు. 1988, 1990, 1993, 1997, 2008, 2013.. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 58 ఏళ్ల అబ్బాసీ.. నవాజ్ షరీఫ్‌కు అత్యంత విధేయుడే కాదు ఆయన వ్యక్తిగత టీమ్‌లో ముఖ్యుడు. పార్లమెంట్‌లో ధనికుల్లో ఒకరు.