ఇల్లిల్లూ గాలిస్తూ గ్యాంగ్ రేప్లు, హత్యలు
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్ల అరాచకాలకు, హింసకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఉత్తర కుండజ్ ప్రావిన్స్లో పౌరులపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ.. కిరాతకంగా చంపేస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది.
ఆఫ్థాన్ దళాలు కుండజ్ ప్రావిన్స్లోని ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధకుడు హోరియా మొసాధిక్ కోరారు. 'కుండజ్లో తాలిబన్ ఉగ్రవాదులు నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ, ఇతర ప్రభుత్వ, ఎన్జీవో ఆఫీసులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రత దళాలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ఎన్జీవో కార్యకర్తలు పేర్లు, ఫొటోలతో కూడిన హిట్ లిస్ట్ను తయారు చేశారు. వారి అడ్రెస్లు, ఫోన్ నెంబర్లూ సేకరించారు. ఉగ్రవాదులు యువకుల సాయంతో ఇంటింటికి వెళ్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు.
ఇళ్లలో ఉన్న మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ, పిల్లలతో సహా కుటుంబ సభ్యులను కిరాతకంగా చంపేస్తున్నారు. బాధితుల్లో సైనికులు, పోలీసులు ఉన్నారు. ఇళ్లల్లో దోపిడీకి పాల్పడుతూ కుటుంబాలను హతమారుస్తున్నారు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తాలిబన్ల దారుణాలను వెల్లడించింది. తాలిబన్ల ఉగ్రవాదుల అరాచకాలను కుండజ్ మెటర్నిటీ ఆస్పత్రిలో బాధితులు ఏకరువుపెట్టారు. ఉగ్రవాదులు తమ వద్ద బందీలుగా ఉన్న మగవాళ్లకు తుపాకీలు ఇచ్చి భద్రతదళాలపై దాడికి ప్రేరేపించడం, మహిళలను చిత్రహింసలు పెడుతూ సామూహిక అత్యాచారాలకు పాల్పడటం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.