అక్రమాలతో అణు భద్రతకు ముప్పు
♦ అణు స్మగ్లర్లతో ప్రభుత్వ మద్దతుదారుల కుమ్మక్కు
♦ పాక్ తీరుపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు
వాషింగ్టన్: అణుశక్తి అక్రమ రవాణాదారులు, ఉగ్రవాదులతో ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న వారు కుమ్మక్కవటం వల్లే అణు భద్రతకు ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాషింగ్టన్‌లో జరుగుతున్న అణు భద్రత సదస్సు ప్రారంభసూచకంగా ఒబామా ఏర్పాటుచేసిన విందులో పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలు అణు భద్రతను శాశ్వత జాతీయ ప్రాధాన్యతగా పరిగణించి జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు.
ఉగ్రవాదం తీవ్రమైన హింసను ప్రదర్శిస్తోందన్న ప్రధాని.. ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న వారు అణు అక్రమ రవాణాదారులు, ఉగ్రవాదులతో ప్రత్యక్షసంబంధాలు నెలకొల్పటం అణుభద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించిందన్నారు. గుహల్లో బతుకుతున్న మనుషులను వెతకకుండా.. నగరాల్లో దాగున్న ఉగ్రవాదుల కోసం కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లతో వేట కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైట్‌హౌజ్‌లో జరిగిన ఈ విందులో 20 దేశాల అధ్యక్షులు పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ.. బ్రసెల్స్ ఘటనతో అణు భద్రతకు పొంచి ఉన్న ముప్పు బహిర్గతమైందన్నారు.
21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తూ.. ఉగ్రవాదం మరింత ప్రమాదకరంగా మారిందన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని మోదీ పునరుద్ఘాటించారు. ‘ఒక దేశంపై దాడిచేసిన ఉగ్రవాది.. నాదేశానికి ఉగ్రవాది కాదనే ఆలోచన నుంచి మనం బయటకు రావాలి’ అని మోదీ అన్నారు. అణు భద్రత, ప్రపంచ భద్రత అంశాలపై ఒబామా తీసుకుంటున్న చొరవను మోదీ ప్రశంసించారు.ప్రపంచవ్యాప్తంగా అణుభద్రతను పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) కు మిలియన్ డాలర్ల (రూ.6.63 కోట్ల) నిధిని భారత్ తరపున సమకూర్చనున్నట్లు తెలిపారు. అణు భద్రతతోపాటు అణుశక్తి అక్రమ రవాణాను అడ్డుకోవటంపైనా అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని భారత్ భావిస్తోంది. కాగా, ఉగ్రవాదులు అణ్వాయుధాలను సమకూర్చుకుంటూ సమాజాన్ని భయపెడుతున్నారని ఒబామా అన్నారు..
మా అణు కార్యక్రమాలు సచ్ఛీలం: పాక్
భారత్‌తో పోలిస్తే తమ దేశంలో అణు శక్తి వినియోగం ప్రమాద రహితమని పాకిస్తాన్ వెల్లడించింది. ఒబామా ఏర్పాటు చేసిన విందులో పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరీ మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా 2,374 చిన్నా చితకా అణు ప్రమాదాలు జరిగాయి. ఇందులో భారత్‌లోనూ ఐదు ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ, 40 ఏళ్లుగా అణుశక్తిని వినియోగిస్తున్నా మా దేశంలో ఒక్క ప్రమాదం గానీ, ఉల్లంఘన గానీ జరగలేదు’ అని అన్నారు. అణు శక్తిని తమ రక్షణకే వినియోగిస్తున్నామని.. ఎవరినో భయపెట్టడానికి కాదని ఆయన తెలిపారు.
నేడు సౌదీకి ప్రధాని.. మోదీ అమెరికానుంచి శనివారం సౌదీ చేరుకోనున్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన పలు అంశాలపై సౌదీ రాజు అబ్దుల్ అజీజ్‌తో చర్చించనున్నారు.
‘ఉగ్ర’నిధులపై యూఎస్, సౌదీ ఆంక్షలు
దక్షిణాసియా, పశ్చిమాసియాలోని అల్ కాయిదా తదితర ఉగ్రవాద సంస్థలకు నిధులందిస్తున్న నలుగురిపై, రెండు సంస్థలపై సౌదీ అరేబియా, అమెరికా సంయుక్తంగా ఆంక్షలు విధించాయి. అలెగ్జాండర్ మెక్ లింటోక్, పాక్ కేంద్రంగా నడుస్తున్న ఇతని అల్-రహమా సంస్థపై, అబ్దుల్ అజీజ్, పాక్ కేంద్రంగా నడుస్తున్న ఇతని జామియా అసారియా మదరసాలతోపాటు నవీద్, ముహ్మద్ ఇజాజ్ సఫారష్‌లపై ఆంక్షలు విధించాయి.