ఎలిజబెత్ కు ఎయిర్ ఇండియా స్మారక ఆల్బమ్!
లండన్: క్వీన్ ఎలిజబెత్ 90వ పుట్టినరోజు వేడుకలకు గుర్తుగా ఎయిర్ ఇండియా ఓ అధికారిక స్మారక ఆల్బమ్ ను వెలువరించనుంది. ప్రచురణకర్త సెయింట్ జేమ్స్ హౌస్ ద్వారా ఆల్బమ్.. ఈ వారం విడుదల కానుంది. లండన్ లోని విండర్స్ కాసిల్ హోం పార్క్ లో మే 12-15 మధ్య జరిగే రాయల్ ఈవెంట్స్ సందర్భంలో పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసింది.
క్వీన్ ఎలిజబెత్ రాచరికపు జీవితంపై లండన్ లో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో కామన్వెల్త్, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆమె అంకితమైన తీరు, సాయుధ దళాలపై సారించిన దృష్టి, గుర్రాలపై చూపించిన ప్రేమ తదితర విషయాలు ప్రముఖంగా ఉంటాయని తెలుస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీలకు స్మారక ఆల్బమ్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సెయింట్ జేమ్స్ హౌస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ ఫ్రీడ్ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ ప్రముఖులు, సంస్థలు, రాష్ట్ర అధిపతులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఈ పుస్తకాల కాపీలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆల్బమ్ సంపాదకీయ భాగస్వాముల కోసం వెతుకుతున్నపుడు తమకు ఎయిర్ ఇండియా యూకె సహకరించేందుకు ముందుకు వచ్చిందని, అదే తమకు మైలురాయిగా చెప్పాలని ఫ్రీడ్ తెలిపారు.
క్వీన్ పుట్టినరోజు వేడుకల సందర్భంలో భారతదేశానికి బ్రిటన్ తో ఉన్న బలమైన సంబంధాలు మరోసారి వ్యక్తమౌతున్నాయని, సెయింట్ జేమ్స్ హౌస్.. ఎయిర్ ఇండియా యూకె ను మంచి సంపాదకీయులుగా గుర్తించి చారిత్రక ఉత్సవాలకు ఆహ్వానించడం ఎంతో గర్వంగా చెప్పుకోవాలని బ్రిటన్ లోని ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ తారా నాయుడు అన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా బ్రిటన్ తో చారిత్రక సంబంధాలు కలిగి ఉందని, అందుకు 1948 జూన్ 8న నాలుగు ఇంజన్ల తో కూడిన మొదటి విమానాన్ని కెయిరో జెనీవాల మీదుగా లండన్ కు పంపడమే పెద్ద ఉదాహరణగా చెప్పాలని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశంనుంచి ఐదు రోజువారీ విమానాలను ఎయిర్ ఇండియా లండన్ బర్మింగ్ హామ్ కు నడుపుతోన్నట్లు తెలిపారు.