రోడ్డు మీద పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకి విరుగుడుగా ఫ్రాన్స్‌లోని ఎయిర్ బస్ సంస్థ నిర్మించబోతున్న ఎయిర్ ట్యాక్సీ ‘వాహన’ నమూనా
ప్రపంచ జనాభాతో పాటు ప్రయాణ, రవాణా వాహనాలూ పెరిగిపోతున్నాయి. ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా, ఎన్ని సొరంగ మార్గాలు తవ్వినా ట్రాఫిక్ తగ్గడం లేదు. ఈ సమస్యకు పరిష్కారమే... భవిష్యత్తులో రాబోతున్న ఎయిర్ ట్యాక్సీలు!
ఎయిర్‌బస్ కంపెనీ నుంచి వస్తోన్న ఎయిర్ ట్యాక్సీ ఇది. అయితే పదేళ్లు ఓపిక పట్టాలి! ఆ తరువాత మీకు ట్రాఫిక్ చికాకులు ఉండవు. కాలుష్యం బాధ అసలే ఉండదు. ఆఫీసుకు లేటవుతామేమో అన్న బెంగకూ గుడ్‌బై చెప్పవచ్చు! ఎందుకలా అంటే... పక్కనున్న ఫొటో చూడండి! ఇలాంటి డ్రోన్‌లు మిమ్మల్ని ఇంటి నుంచి ఆఫీసులో దిగబెడతాయి. పనైపోగానే మళ్లీ ఇళ్లకు చేరుస్తాయి కూడా! అబ్బో... ఇలాంటివి చాలా చూశాం. విన్నాం కూడా. ఇది మాత్రం అందుబాటులోకి వస్తుందన్న గ్యారెంటీ ఏమిటి? ఇదేనా మీ సందేహం. ఓకే.. ఏదో ఊరు పేరు లేని, చిన్నా చితక కంపెనీ తాము ఇలాంటి హైటెక్ డ్రోన్లు తయారు చేస్తున్నామంటే నమ్మలేకపోవచ్చుగానీ... ప్రపంచంలోనే అతికొద్ది విమాన సంస్థల్లో ఒకటైన ఎయిర్‌బస్ (ఫ్రాన్స్) ఈ మాట అంటే దానికి విలువ ఉంటుంది కదా!
అవునండీ. 2027 నాటికల్లా తాము పైలట్ అవసరం లేని ఎయిర్ ట్యాక్సీలు సిద్ధం చేస్తామని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎగురుతూ కనిపిస్తాయని బల్లగుద్ది మరీ చెబుతోంది. ‘వాహన’ పేరుతో ఎయిర్‌బస్ ఇందుకు శ్రీకారం చుట్టింది కూడా. 2030 నాటికల్లా మహానగరాల్లో జనాభా గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతాయని, అందువల్లనే తాము ట్రాఫిక్ బాదరబందీలేవీ లేకుండా వాయుమార్గ ప్రయాణాన్ని సాకారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అంటోంది.
పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీలకు అవసరమైన టెక్నాలజీలు అన్నీ అందుబాటులో ఉన్నా... గాల్లో ప్రమాదాలను గుర్తించి, తగ్గట్టుగా స్పందించే నమ్మకమైన సాంకేతిక పరిజ్ఞానం మాత్రం ఇంకా అభివృద్ధి కాలేదని ఎయిర్‌బస్ ఉన్నతాధికారి ఒకరు అంటున్నారు. ‘వాహన’ ప్రాజెక్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైందని, వచ్చే ఏడాది చివర్లో ఫ్లైట్ టెస్ట్‌లు మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో పదేళ్లలో ఈ ‘వాహనా’లు అందుబాటులోకి వస్తాయన్నమాట!