
మా పోరు ఇస్లాంతో కాదు: ఒబామా
అమెరికా సహా పశ్చిమదేశాలన్నీ ఇస్లాంకు వ్యతిరేకమనే తీవ్రాదుల వాదనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా దీటైన జవాబిచ్చారు. తమ పోరు ఇస్లాంతో కాదని, మతానికి వక్రభాష్యాలు చెబుతూ ఉగ్రవాదానికి పాల్పడే వారి పైనేనని స్పష్టం చేశారు. గురువారం వైట్హౌస్లో తీవ్రవాద వ్యతిరేక సదస్సులో ప్రసంగించిన ఆయన ఐఎస్ఐఎస్, అల్ కాయిదా వంటి సంస్థల తీరును ముస్లిం ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇస్లాం రాజ్యస్థాపన అంటూ వెర్రెత్తిపోయే ఉగ్రవాదులు.. ముస్లింల జీవన స్థితిగతులను ఏనాడూ పట్టించుకున్నపాపన పోలేదని ఒబామా విమర్శించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇస్లాంను తృణీకరిస్తాయనే అబద్ధాన్ని యువత మెదళ్లలో నూరిపోయడం ద్వారా ఉగ్రసంస్థలు తమ సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అమెరికా తలపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక పోరుకు సహకరించాలని సదస్సులో పాల్గొన్న దాదాపు 60దేశాల ప్రతినిధులను ఆయన కోరారు.