అమెరికా అధ్యక్షుడిగా హిందువు?
అమెరికా అధ్యక్షుడిగా హిందువు?
Published Thu, Jan 19 2017 11:37 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
అమెరికాలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని, ఇక్కడ భవిష్యత్తులో కేవలం మహిళలే కాక హిందువులు, లాటినోలు, యూదులు కూడా అధ్యక్షులయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. వైట్ హౌస్‌లో తన చిట్ట చివరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రతి జాతికి, మతానికి, ఈ దేశంలో ప్రతి మూలకు చెందిన ప్రతిభావంతులు ఎదుగుతున్నారని, అదే అమెరికా అసలైన బలమని ఆయన అన్నారు. ఈ అవకాశాలను మనం ప్రతి ఒక్కరికీ ఇవ్వడం కొనసాగిస్తే, త్వరలోనే ఒక మహిళ అధ్యక్షురాలవుతుందని చెప్పారు. అలాగే ఒక లాటినో, యూదు, హిందూ అధ్యక్షులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అన్ని రకాల అధ్యక్షులు వస్తారని, ఆ సమయానికి వాళ్లను ఏమని పిలవాలో ఎవరికీ సరిగ్గా తెలియదంటూ నవ్వేశారు.
దేశానికి ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు అయినప్పుడు.. అలాంటిది మళ్లీ జరిగే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఒబామా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అమెరికాలో చాలామంది తమకు గుర్తింపు లేదని భావించారని, వాళ్లే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఓటేశారని చెప్పారు. తమను చిన్నచూపు చూస్తున్నారని వాళ్లు అనుకున్నారని, తమకు వచ్చిన అవకాశాలు తమ పిల్లలకు వస్తాయో రావోనని భయపడ్డారని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు వెళ్తారు. తాజాగా మీడియా మీద కూడా ట్రంప్ విరుచుకుపడిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఒబామా ప్రస్తావించారు. మీడియా ఉండటం వల్లే తాము నిజాయితీగా ఉండగలుగుతూ, మరింత కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. వాస్తవానికి వైట్‌హౌస్ నుంచి మీడియాను దూరంగా ఉంచాలని ట్రంప్ భావిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఒబామా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
Advertisement