బాంబులు కురిపించడం, క్షమాణలు చెప్పడమా!
విదేశాల్లోని పౌరకేంద్రాలపై గుడ్డిగా దాడులు జరపడం, అమాయక ప్రజలను బలి తీసుకోవడం, ఆనక తీరిగ్గా క్షమాపణలు చెప్పడం అమెరికా పాలకులకు ఆనవాయితీగా మారిపోయింది. అనేక ఘటనల్లో కనీసం క్షమాపణలు చెప్పకుండా గుడ్డిగా సమర్థించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రపంచ పౌరహక్కుల సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన సందర్భాల్లో మాత్రమే అమెరికా పాలకులు క్షమాపణలు చెప్పారు. అలాగే అఫ్ఘానిస్తాన్‌లోని కుందజ్ పట్టణంలో అక్టోబర్ 3న అమెరికా సైనికులు ఓ ఆస్పత్రిపై బాంబులు కురిపించి 22 మంది అమాయకులను బలితీసుకున్న సంఘటనకు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా క్షమాపణలు చెప్పారు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం.
1991, జనవరి 21: బాగ్దాద్ శివారు, అబూ గ్రాహిబ్‌లోని 'ఇన్‌ఫ్యాంట్ ఫార్ములా ప్రొడక్షన్ ప్లాంట్' పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణసేనలు బాంబుల వర్షం కురిపించి శిశు పాల ఉత్పత్తి కేంద్రాన్ని సమూలంగా ధ్వంసం చేశాయి. ప్రాణనష్టం వివరాలు తెలియలేదు. అది జీవ రసాయన ఆయుధాల ఉత్పత్తి కేంద్రం అవడం వల్లనే దాడులు జరిపామని అప్పటి హెచ్‌డబ్లూ బుష్ ప్రభుత్వం సమర్థించుకుంది.
1991, ఫిబ్రవరి 13: బాగ్దాద్ విమానాశ్రయానికి సమీపంలోని పౌరశిబిరంపై అమెరికా సైన్యం లేజర్ గైడెడ్ బాంబులను కురిపించగా 408 మంది ఇరాకీ పౌరులు మరణించారు. ఆ శిబిరం వద్ద ఇరాక్ సీనియర్ నాయకులు, సైనిక కమాండర్లు కనిపించడం వల్లనే దాడులు జరిపామని అమెరికా పాలకులు సమర్ధించుకున్నారు.
1998, ఆగస్టు 20: సూడాన్‌లోని అల్ షిఫా ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీపై అమెరికా క్రూయిజ్ క్షిపణులతో దాడులు జరిపింది. అందులో ఒక పౌరుడు మరణించగా, 11 మంది గాయపడ్డారు. ఒసామా బిన్ లాడెన్‌తో ఆ ఫ్యాక్టరీకి సంబంధం ఉన్న కారణంగానే తాము దాడులు జరిపామని అప్పటి బిల్ క్లింటన్ ప్రభుత్వం సమర్థించుకుంది.
1999, ఏప్రిల్ 12: కొసోవో యుద్ధం సందర్భంగా సెర్బియాలోని గ్రెడిలికా వద్ద ఓ రైలుపై అమెరికా ఎఫ్-15ఈ యుద్ధ విమానం క్షిపణులు ప్రయోగించగా 14 మంది పౌరులు మరణించారు. ఆనక 'పొరపాటు' జరిగిందంటూ అమెరికా యంత్రాంగం క్షమాపణలు చెప్పింది.
1999, ఏప్రిల్ 23: కొసోవో యుద్ధం సమయంలోనే సెర్బియా బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రంపై అమెరికా బాంబులు కురిపించింది. 16 మంది ఉద్యోగులు మరణించారు. సెర్బియా అధ్యక్షుడు స్లొబోడన్ మిలోసెవిక్ కమాండ్, కంట్రోల్ కేంద్రం అవడం వల్లనే సైన్యం దాడులు జరిపిందని అప్పటి బిల్ క్లింటన్ ప్రభుత్వం సమర్థించుకుంది.
1999, మే7: సెర్బియాలోని చైనా ఎంబసీపై అమెరికా యుద్ధ విమానం బాంబులు కురిపించడంతో ముగ్గురు ఎంబసీ సిబ్బంది మరణించారు. 20 మందికి పైగా మరణించారు. 'ఇది ఘోర తప్పిదం. పాత మ్యాప్‌ను ఆధారం చేసుకోవడం వల్ల పొరపాటు జరిగింది' అని అప్పటి అమెరికా రక్షణ మంత్రి విలియం కొహెన్ వివరణ ఇచ్చారు.
2001, అక్టోబర్ 16-26: కాబుల్‌లోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ కాంప్లెక్స్‌పై అమెరికా బాంబుదాడులు. 55వేల మందికి సరిపడా ఆహారం, బ్లాంకెట్లు, ఇతర సామాగ్రి ధ్వంసం.
2003, ఏప్రిల్ 8: బాగ్దాద్‌లోని అల్ జజీరా కార్యాలయంపై దాడి. ఓ జర్నలిస్ట్ మరణించగా, మరో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు అక్కడికి సమీపంలో, విదేశీ జర్నలిస్టులు బసచేసిన ఓ పాలస్తీనా హోటల్‌పై అమెరికా బాంబుల దాడి జరపగా ఇద్దరు రిపోర్టర్లు మరణించగా, రాయిటర్స్‌కు చెందిన ఓ కెమెరామన్ మరణించారు.