
వాషింగ్టన్: భారత రాయబారి హర్షవర్దన్ ష్రింగ్లాకు అమెరికా ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అందులో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని శ్వేతసౌధంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం వేగవంతం చేయడానికి సహకరించినందుకు ట్రంప్‌కు ష్రింగ్లా కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు భారత రాయబారికి అక్కడి విదేశాంగశాఖలోని దక్షిణ, మధ్య ఆసియా విభాగం అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్ ప్రత్యేకంగా వీడ్కోలు పలికారు. ఉభయ దేశాల మధ్య బంధానికి ష్రింగ్లా కెప్టెన్‌గా వ్యవహరించారని కొనియాడారు.
భారత విదేశాంగశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ష్రింగ్లా.. ఉభయ దేశాల మైత్రి బలోపేతానికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. అంతకుముందు అమెరికా ప్రొటోకాల్ చీఫ్ హ్యాండర్సన్.. బ్లెయిర్ హౌజ్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విదేశాంగశాఖ కార్యదర్శి ఉన్న విజయ్ గోఖలే పదవీకాలం జనవరి 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 23న ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 29న విదేశాంగశాఖ కార్యదర్శిగా ష్రింగ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1984 బ్యాచ్‌కు చెందిన హర్షవర్ధన్ ష్రింగ్లా అనేక పదవులను అధిరోహించారు. ఆయన 35 ఏళ్ల సర్వీసులో బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలలో భారత హైకమిషనర్‌గా సేవలందించారు.
A final goodbye! pic.twitter.com/AMvqROEaL2
— Harsh V Shringla (@HarshShringla) January 12, 2020