శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు | american court finds raghunandan guilty in saanvi murder case | Sakshi
Sakshi News home page

శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు

Published Fri, Oct 10 2014 8:00 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు - Sakshi

శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు

అమెరికాలో చిన్నారి శాన్వి, ఆమె నాయనమ్మ సత్యవతిల హత్యకేసులో యండమూరి రఘునందన్ను కోర్టు దోషిగా తేల్చింది. అతడు ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో అతడికి జీవితఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే తాను దొంగతనం మాత్రమే చేశాను పత్ప హత్యలతో తనకు సంబంధం లేదని రఘునందన్ వాదించాడు. దోషులను కఠినంగా శిక్షించాలని కోర్టును కోరాడు.

2012 సంవత్సరంలో అప్పర్ మెరియన్ ప్రాంతంలో శాన్వి వెన్నా (10 నెలల) అనే చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆమెను చంపేశాడని, ఆమెతో పాటు చిన్నారి నాయనమ్మ సత్యవతి (61)ను కూడా చంపేశాడని రఘునందన్ మీద అభియోగాలు వచ్చాయి. రెండు కౌంట్ల ఫస్ట్ డిగ్రీ హత్య కేసులు అతడిమీద రుజువైనట్లు ఏడుగురు మగ, ఐదుగురు ఆడ న్యాయమూర్తులతో కూడిన జ్యూరీ తేల్చిచెప్పింది. ఈ తీర్పుపై శాన్వి తండ్రి వెంకట్ వెన్నా మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

తీర్పు వెలువడగానే రఘునందన్ తల్లి పద్మావతి భోరున విలపించారు. ఆమె వెంటనే భారతదేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. తన కొడుకును ఎలాగోలా కాపాడాలని ఆమె రోదిస్తూ కోరారు. 1997లో తన భర్త, భారతదేశంలో పోలీసు అధికారిగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో్ మరణించినట్లు ఆమె కోర్టుకు చెప్పారు. అప్పటికి 11 ఏళ్ల వయసులో ఉన్న తన కొడుకు రఘునందన్.. తండ్రిలేని జీవితం ఎందుకంటూ ఆత్మహత్య చేసుకోబోయినట్లు తెలిపారు.

2012 అక్టోబర్ 12వ తేదీన మార్కిస్ అపార్ట్మెంట్లలో కిడ్నాప్, హత్య సంఘటనలు జరిగాయి. శాన్వి కోసం వెతుకుతున్న పోలీసులకు అక్కడో లేఖ కనిపించింది. అందులో 50వేల డాలర్లు ఇస్తేనే పిల్లను ఇస్తామని, లేకపోతే చంపేస్తామని ఉంది. అయితే, శాన్వి తల్లిదండ్రుల అసలు పేర్లతో కాకుండా వాళ్లను బాగా తెలిసిన వాళ్లు మాత్రమే పిలిచే పేర్లను ఆ నోట్లో రాయడంతో పోలీసుల పని సులభమైంది. వాళ్ల విచారణలో రఘునందన్ తన నేరాన్ని అంగీకరించాడు. కిడ్నాప్ చేసిన కొద్దిసేపటికే శాన్విని చంపేసినట్లు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement