ఒక్క ఐడియా అమెరికానే మార్చేస్తుంది
మీ టూత్ పేస్ట్ అమ్మకాలు వెయ్యి రెట్లు పెరిగే అయిడియా నా దగ్గరుంది. ఒక మిలియన్ డాలర్లు ఇస్తే చెబుతాను అన్నాడట వెనకటికి ఒక తెలివైన కుర్రాడు. అదేమిటో చెప్పమని టూత్ పేస్ట్ కంపెనీ యజమాని అడిగాడట. ఐడియా నచ్చితే రెండు మిలియన్ల డాలర్లు ఇస్తానన్నాడట. మీ టూత్ పేస్ట్ మూత వెడల్పును ఒక మిల్లీ మీటర్ పెంచమన్నాడట కుర్రాడు. దీని వల్ల ఎక్కువ పేస్టు బయటికి వస్తుంది. ఈ అయిడియా వినగానే అక్షర లక్షల డాలర్లు ఇచ్చేశాడట యజమాని. ఇలాంటి పెద్ద మార్పు తెచ్చే చిన్న సలహానే అమెరికా ప్రభుత్వానికి ఇచ్చాడు ఒక భారతీయ బాలుడు.
పధ్నాలుగేళ్ల సువీర్ మీర్ చందానీ అనే ఎన్నారై విద్యార్థికి వచ్చిన ఒక చిన్న ఐడియా అమెరికా ప్రభుత్వానికి ఏకంగా 400 మిలియన్ల డాలర్ల ఖర్చును తగ్గిస్తోంది. అయిడియా ఎంత సింపుల్ అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో వాడే టైమ్స్ న్యూ రోమన్ అనే లెటర్ టైప్ (ఫాంట్) కి బదులుగా గారామోండ్ అనే ఫాంట్ ను వాడితే ఏడాదికి 400 మిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుందన్నాడు సువీర్.
అదెలాగంటే ఇంగ్లీష్ భాషలో చాలా విరివిగా వాడే అక్షరాలు ఏఈఐఓయూ అనే వొవెల్స్ (అచ్చులు). టైమ్స్ న్యూరోమన్ ఫాంట్ లో ఆ అక్షరాలు చాలా లావుగా ఉంటాయి. ఎక్కువ ఇంక్ వీటికి అవసరమౌతుంది. గారామోండ్ ఫాండ్ చాలా సన్నని ఫాంట్. దానికి చాలా తక్కువ ఇంక్ అవసరమౌతుంది. టైమ్స్ న్యూరోమన్ ఫాంట్ తో ఒక పేజీ రాస్తే ఖర్చయ్యే ఇంకు కంటే గారామోండ్ కి 25 శాతం తక్కువ ఇంకు అవసరమౌతుంది. ఇప్పుడీ సలహాను అమెరికన్ ప్రభుత్వమే కాదు, మొత్తం అమెరికన్ సమాజమే 'భలే భలే' అంటూ మెచ్చుకుంటోంది.